మహిళల రక్షణకు తక్షణ చర్యలు
● పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల కేసులు ● అడ్డూ అదుపు లేని ఈవ్‌టీజింగ్
ఖమ్మంక్రైం : జిల్లాలో మహిళలపై గత రెండేళ్లుగా నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నాలుగైదు నెలలుగా దారుణ హత్యలకూ గురవుతున్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 2024లో 941 కేసులు నమోదు కాగా, 2025లో 1,146, ఈ సంవత్సరం ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. 2024లో వేధింపులు తట్టుకోలేక 16 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడగా, 2025లో ఆ సంఖ్య 20కి పెరిగింది.
పెరిగిన అత్యాచార కేసులు..
జిల్లాలో మహిళలపై వేధింపులతో పాటు అత్యాచారాల కేసులు సైతం నమోదవుతున్నాయి. 2024లో 74 అత్యాచార కేసులు నమోదు కాగా, 2025లో 84, ఈ సంవత్సం ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. పలువురు మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని సైతం చెప్పుకునే పరిస్థితి లేక కుమిలిపోతున్నారు.
అడ్డూఅదుపు లేని ఈవ్‌టీజింగ్..
జిల్లాలో మహిళలపై ఈవ్‌టీజింగ్ అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. షీటీమ్స్ ఉన్నా గతంలో వలె పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బస్టాండ్, షాపింగ్‌మాల్స్, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రదేశాల్లో ఇది మరింతగా పెరుగుతోంది. 2024లో 17 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, 2025లో ఈ సంఖ్య ఏకంగా 41కి పెరిగింది. ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు ఎంతో మంది ఉంటారని సమాచారం.
సమస్యలు చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించేలా రక్షణ చర్యలు చేపడుతున్నాం. వరకట్న వేధింపులు ఎదరైన వారు సైతం నేరుగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. కుటుంబసభ్యులను పిలిచి మొదట కౌన్సిలింగ్ ఇస్తాం. అయినా వారిలో మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తాం. ఈవ్‌టీజింగ్‌కు గురైన మహిళలు షీటీమ్స్ వారికి ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయం జరుగుతుంది. సఖి, భరోసా కేంద్రాలు సైతం మహిళలకు అండగా ఉంటాయి.
– చిట్టిబాబు, మహిళా పీఎస్ సీఐ


