జలవిలాపం | - | Sakshi
Sakshi News home page

జలవిలాపం

Mar 6 2026 8:14 AM | Updated on Mar 6 2026 8:14 AM

నానాటికీ లోతుల్లోకి..

డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరికి

మరింత లోతుల్లోకి..

కొన్ని మండలాల్లో

వేగంగా పడిపోతున్న నీటి మట్టం

ఈ వేసవిలో పొంచి ఉన్న

నీటి ఎద్దడి

జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లా భూగర్భ జలశాఖ తాజా లెక్కల ప్రకారం... డిసెంబర్‌లో భూఉపరితలం నుంచి కేవలం 2.89 మీటర్ల లోతుల్లోనే లభ్యమైన నీరు.. ఫిబ్రవరి నాటికి 4.08 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే మూడు నెలల వ్యవధిలోనే 1.19 మీటర్ల మేర నీటి మట్టం పడిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఏప్రిల్‌, మే నెలల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

కొన్ని మండలాల్లో కాస్త పైకి..

జిల్లాలో ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు తగ్గగా.. మరికొన్నిచోట్ల మాత్రం పెరిగాయి. అత్యధికంగా కామేపల్లి మండలంలో 2.37 మీటర్ల మేరకు నీరు ఇంకింది. ఈ మండలంలో జనవరిలో 4.88 మీటర్ల వద్ద నీరు ఫిబ్రవరి వచ్చే వరకు 7.25 మీటర్లకు పడిపోయింది. రఘునాథపాలెం మండలంలో 3.77 మీటర్ల నుంచి 5.47 మీటర్లకు పడిపోయింది. ఇక ఎర్రుపాలెం, వేంసూరు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాగా, బోనకల్‌లో 0.19 మీటర్లు, చింతకానిలో 0.10, వైరాలో 0.04 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.

గత ఏడాదితో పోలిస్తే..

ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గుతున్నా, గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉంది. 2024 డిసెంబర్‌లో 3.87 మీటర్ల వద్ద నీరు ఉండగా.. 2025 డిసెంబర్‌లో 2.89 మీటర్ల వద్దే నీటి లభ్యత ఉంది. అంటే 0.98 మీటర్ల మేర నీరు పైనే ఉన్నట్లు గుర్తించారు. ఇక గత ఏడాది జనవరిలో 4.49 మీటర్ల వద్ద ఉంటే ఈ ఏడాది జనవరిలో 3.50 మీటర్ల వద్ద నీటి లభ్యత నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో 4.99 మీటర్ల వద్ద.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4.08 మీటర్ల వద్దే ఉండడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంతమేర బాగానే ఉన్నా రానున్న నెలల్లో పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇక్కట్లు తప్పవా ?

కొద్దినెలలుగా భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతుండడంతో ఈ వేసవిలో నీటికి కటకట ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా తాగునీటికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వేసవిలో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్నందున భూగర్భ జలాలు మరింత ఇంకిపోయేందుకు ఆస్కారం ఉంది. గత నాలుగైదు నెలలుగా భారీ వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన వేసవిలో అడపాదడపా వర్షాలు కురిస్తేనే పరిస్థితి కాస్త కుదుటపడుతుందని భావిస్తున్నారు. అయినా వేసవిలో నీటి ఎద్దడి ఎదురుకాకుండా అత్యధికంగా భూగర్భ జలాలు పడిపోయే గ్రామాల్లో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

సత్తుపల్లి.. పాతాళంలో

జిల్లాలోని మొత్తం 21 మండలాలను పరిశీలిస్తే సత్తుపల్లి మండలంలోనే భూగర్భ జలాలు అత్యంత దిగువన ఉన్నాయి. 2025 డిసెంబర్‌, 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరిశీలిస్తే భూగర్భ జలాలు తగ్గుతూ రావడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్‌లో ఇక్కడ 10.23 మీటర్ల వద్ద ఉన్న నీరు ఈ ఏడాది జనవరిలో 10.92 మీటర్లకు, ఫిబ్రవరిలో 11.82 మీటర్ల వద్దకు పడిపోయింది. అదే 2024 డిసెంబర్‌లో 12.6 మీటర్లు, 2025 జనవరిలో 13.75, ఫిబ్రవరిలో 14.45 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. 2024 – 05తో పోలిస్తే 2025 – 26లో సత్తుపల్లిలో భూగర్భ జలాల నీటిమట్టం ఆశాజనకంగానే ఉండడం కాస్త ఊరట కలిగిస్తోంది.

జిల్లాలో గత ఏడాది డిసెంబర్‌లో 2.89 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి అవి 3.50 మీటర్ల కిందకు పోయాయి. అంటే నెలలోనే 0.61 మీటర్ల మేర నీరు తగ్గింది. ఫిబ్రవరి వచ్చే నాటికి అది 4.08 మీటర్లకు వెళ్లింది. ఇలా నెలనెలకు భూగర్భ జలాలు తగ్గుతుండడం గమనార్హం.

గణనీయంగా తగ్గుతున్న భూగర్భ జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement