వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యత
● జిల్లా అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తింపు ● సీసీ కెమెరాల్లో ఎలుగుబంట్లు కూడా నమోదు ● సంరక్షణపై దృష్టి సారించిన అటవీశాఖ
రిజర్వ్ ఫారెస్ట్‌లో గర్తించిన చిరుత పులులు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా అడవుల్లో చాలా ఏళ్ల తర్వాత చిరుత సంచారాన్ని గుర్తించారు. కొన్నాళ్లుగా అటవీ సంరక్షణపై దృష్టి సారించడంతో పాటు జంతువులు, వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సాసర్ పిట్ల ద్వారా నీరు సమకూరుస్తూ అగ్నిప్రమాదాల నివారణకు కృషి చేస్తుండడంతో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని గుర్తించారు. ఈమేరకు 360 డిగ్రీల కోణంలో ఫొటోలు తీసే సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడమే కాక డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాన్ని రికార్డు చేస్తున్నారు. ఈక్రమాన బిడ్డతో కూడిన చిరుత తిరుగుతున్నట్లు తేలింది. అలాగే, ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈమేరకు వీటి సంరక్షణపై దృష్టి సారించడమే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయా.. ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నాయా అనే అంశాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
70వరకు జీవజాతులు
వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అటవీ శాఖ... నిర్దేశిత అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల జనాభాను శాసీ్త్రయంగా లెక్కించేందుకు అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగిస్తోంది. వేసవిలో వన్యప్రాణులకు అవసరమైన నీరు సమకూర్చేందుకు సాసర్ పిట్లు నిర్మించడతో పాటు అగ్నిప్రమాదాల నివారణపైనా దృష్టి సారించారు. ఇదే సమయాన సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తుండడంతో ఖమ్మం, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధి అటవీ ప్రాంతాన వన్యప్రాణులు నివసిస్తున్నట్లు తేలింది. దాదాపు 70 జాతుల వరకు జీవాలు ఉంటున్నాయని ఇటీవల చేపట్టిన సర్వేలో తేలడంతో వీటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల్లో చిరుతపులులు, ఎలుగుంట్లు వంటివి నమోదు కావడంతో ఆరోగ్య స్థితిగతులపై ఆరాతీస్తూ జీవన విధానాన్ని పరిశీలి స్తున్నారు. అంతేకాక దాహార్తి తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా నీటి కుంటలు, సోలార్ పంపుల ద్వారా సాసర్ పిట్లలో నిరంతరం నీరు అందుబాటులో ఉంచుతున్నారు.
వేటగాళ్ల కట్టడిపై దృష్టి
జిల్లాలో వన్యప్రాణులను గతంలో వేటాడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వన సంరక్షణ సమి తుల ద్వారా వన్యప్రాణులను వేటాడే వారిని గుర్తించి వారికి కౌన్కెసలింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతం సమీపాన నివసించే వారికి జంతువులను వేటాడితే ఎదురయ్యే అనర్థాలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రాత్రి సమయాన అడవిలోకి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో వన్యప్రాణుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకించి వేసవిలో తాగునీరు సమకూర్చేలా నీటి కుంటలు నిర్మించడంతో సోలార్ బోర్ల ద్వారా నీరు నింపుతున్నాం. ఇదే అధునాతన సాంకేతికతతో వన్యప్రాణుల జీవన విధానం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో ప్రజలు కూడా సహకరించాలి.
– సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, జిల్లా అటవీ అధికారి


