● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన
తిరుమలాయపాలెం: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన పరిస్థితి ఇకపై ఉండదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలకు ప్రభుత్వ వైద్యాన్ని దరిచేర్చే లక్ష్యంతో తమ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. తిరుమలాయపాలెంలో రూ.26కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రి భవనానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశాక మాట్లాడారు. జిల్లా ఆస్పత్రిని తలపించేలా అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. గతంలో 30 పడకలుగా ఉన్న ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తుండడంతో ప్రసవాలు, అత్యవసర చికిత్స కోసం ఖమ్మం వెళ్లాల్సిన బాధలు తప్పుతాయని పేర్కొన్నారు. డయాలసిస్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్యం కొద్ది నెలల్లోనే అందుబాటులోకి వస్తుందని భరోసా ఇచ్చారు. అయితే, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా వైద్యులు అంకితభావంతో పనిచేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని, వైద్యులు అందుబాటులో ఉంటారనే నమ్మకం కలిగినప్పుడు ప్రజలు వస్తారని తెలిపారు. ఈమేరకు వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. విధుల్లో చిత్తశుద్ధి చూపే వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తానని మంత్రి ప్రకటించారు. కలెక్టర్‌తో పాటు అధికారులు కూడా తరచూ ఆస్పత్రులను పరిశీలించాలని తెలిపారు. విద్య, వైద్యారంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా చేపడుతూ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చెక్కులు అందజేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృపాఉషశ్రీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్, డీఎంహెచ్‌ఓ రామారావు, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్ ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, తహసీల్దార్ విల్సన్, ఆత్మకమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణతో పాటు బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, బోడ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.


