గుండాల: మేడారం సమ్మక్క భర్త, మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతర అనంతరం మాఘమాసంలో సమ్మక్క–పగిడిద్దరాజుల నాగవెళ్లి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం యాపలగడ్డకు చెందిన అరెం వంశస్తులు, పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో గ్రామంలోని గుట్ట నుంచి పడగ(జెండా)ల రూపంలో పగిడిద్దరాజును గద్దెల వద్దకు చేర్చారు. ముందురోజు రాత్రి గర్భగుడి వద్ద ఆభరణాలు, పడగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక బుధవారం పగిడిద్దరాజును డప్పువాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో ఊరేగింపు ద్వారా గద్దెలపై ప్రతిష్టించి సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వనం(సమ్మక్క దేవత) రాకతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం జోగుకు వెళ్లి, రాత్రి దేవతలకు గంగాస్నానం చేయిస్తారు. దేవతలకు నాగవెళ్లి జరుపుతారు. శుక్రవారం తెల్లవారుజామున గుడి మెలిగి, దేవతలకు సెలపయ్యను హారం ఇచ్చాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బంబోబస్తు ఏర్పాటు చేశారు.
దూలుగొండ ముసలమ్మ జాతర ప్రారంభం
ఈసం వంశీయుల ఇలవేల్పు దూలుగొండ ముసలమ్మ(దేవత) జాతర బుధవారం రోళ్లగడ్డలో ప్రారంభించారు. ఈసం, మాడె వంశీయులు, పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలతో మండ మెలుగుట, గుడి మెలుగుట నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలతో గర్భగుడి వద్ద పూజలు చేశారు. గురువారం దేవతను గద్దెలపై ప్రతిష్ఠించాక నిండు జాతర ప్రారంభమవుతుంది. శుక్రవారం మొక్కులు చెల్లించుకోనుండగా మూడురోజుల పాటు జాతర జరుగుతుంది.


