విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్ 10వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో మొదటి స్థానం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
జిల్లాకు ప్రశంసలు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం నిర్వహించే 99 రోజుల కార్యక్రమాన్ని పడక్బందీగా అమలుచేయడానికి సన్నద్ధమయ్యాం. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈనెల 6వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 12 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పది అంశాలు ఉంటాయి. తొలిరోజు ఖమ్మంలో జరిగే ఉమ్మడి జిల్లా సమావేశంలో జిల్లా మంత్రులు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు హాజరవుతారు. విద్య, వైద్య, గృహ నిర్మాణం, వ్యవసాయ రంగాల్లో జిల్లా ఇప్పటికే రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉండగా.. మిగతా రంగాల్లోనూ ముందు నిలిపేలా కృషి జరుగుతోంది’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రభుత్వం పది అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని కార్యక్రమం చేపడుతోంది. ఇందులో పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత, రైతు సంక్షేమం, విద్య, యువత–క్రీడలు, పర్యావరణం వంటివి ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగా జిల్లాలో పరిస్థితులపై ఇప్పటికే నివేదిక రూపొందించాం. నివేదికలో వివరాలను బేరీజు వేసుకుని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాం. 99 రోజుల్లో క్షేత్ర స్థాయి సమస్యలు పరిష్కారం కావడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధమవుతుంది. శాఖల వారీ అధికారులు ఎప్పటికప్పుడు పనుల తీరును పర్యవేక్షించడం ద్వారా కార్యక్రమం ముగిసే నాటికి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో గతంతో పోలిస్తే మెరుగుపడతాం.
జిల్లాలో 571 గ్రామపంచాయతీలతో పాటు ఏదులాపురం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, మధిర మున్సిపాలిటీలు, ఖమ్మం కార్పొరేషన్ ఉన్నాయి. వార్డు, గ్రామం, మున్సిపాలిటీ, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు 99 రోజుల ప్రణాళిక నిర్వహిస్తాం. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన అంశాలపై సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ ప్రతినిధులకు వర్క్‌షాప్ ఏర్పాటుచేస్తున్నాం. ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ రోజు కార్యక్రమంలో ఏం చేయాలో కరదీపికలు అందిస్తాం. తద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఫైళ్లు పరిష్కరించడం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలుచేయడం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లో రోల్ మోడల్‌గా నిలుపుతాం.
పరిశుభత్ర, పచ్చదనంతో గ్రామాలు, పట్టణాలు మెరిసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ చేపడ తాం. రోడ్ల పక్కన ఉన్న పిచ్చిమొక్కల తొలగింపు, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయడం వంటివి ఇందులో భాగంగానే జరుగుతాయి. మరోవైపు అద్దెభవనాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా సొంత భవనాల్లోకి మారుస్తాం. జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ నెల 1నుంచి 12 వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తాం. శాఖల వారీగా పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కూడా చేపడుతాం.
పకడ్బందీగా ‘99 రోజుల ప్రణాళిక’ అమలు
హైదరాబాద్‌లో తాజాగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి సమీక్షలో పలు రంగాల్లో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదు ఓవరాల్ ర్యాంకింగ్‌లో జిల్లా మొదటి స్థానాన నిలిచింది. మూడు వారాల్లో జిల్లాలోని 10 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తుండగా.. రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఉన్నాం. అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో రాష్ట్రంలో ప్రథమ స్థానం, నెలవారీ అగ్రికల్చర్ ర్యాంకింగ్‌లోనూ అగ్రస్థానం దక్కింది. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు శాతంలోనూ అద్భుతమైన గుర్తింపు వచ్చింది. మొత్తంగా నాలుగు ప్రాధాన్యత రంగాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానాన నిలవడం సంతోషంగా ఉంది.


