లోడ్‌కు అనుగుణంగా సరఫరాకు ప్రణాళిక మంచుకొండలో సబ్‌స్టేషన్ నిర్మాణం 110 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ లైన్లు
ముందస్తు చర్యలు
ఖమ్మం వ్యవసాయం: వేసవి ఎండ తీవ్రత ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటికే 34 – 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో సహజంగానే విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ ఏడాది యాసంగిలోనూ విస్తారంగా పంటలు సాగు చేసిన రైతులు బోర్లు, బావులు, కాల్వలు, జలాశయాల్లోని నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా వినియోగిస్తున్నారు. మరోపక్క పరిశ్రమలకే కాక ఇళ్లలోనూ కూలర్లు, ఏసీలు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని గుర్తించారు. ఇది వచ్చే రెండు నెలలు గరిష్ట స్థాయికి చేరనుండడంతో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సర్కిల్‌కు కోటా పెంపు
ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఇప్పటికే కోటా పెంచారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో రోజుకు 7.06 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయగా, ఈ ఏడాది 8.25 మిలియన్ యూనిట్లకు పెంచి సరఫరా చేస్తున్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే నిత్యం 1.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా అందుతోంది. జిల్లాలో వినియోగం కూడా అదే స్థాయిలో ఉండగా.. ఎండలు మరింత పెరిగితే కోటా మరికొంత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది.
కొత్త సబ్‌స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్లు
ఇటీవల జిల్లాలో కొత్తగా విద్యుత్ డివిజన్ ఏర్పాటైంది. మరోపక్క జిల్లా కేంద్రమైన ఖమ్మం విస్తరిస్తూ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ తీవ్రతతో మరింత లోడ్ పెరగనున్నందున రఘునాథపాలెం మండలం మంచుకొండలో నూతన సబ్‌స్టేషన్ నిర్మించారు. తద్వారా నగర పరిసర ప్రాంతాలకు విద్యుత్ సమస్య తీరుతుందని చెబుతున్నారు. అలాగే, వేసవి లోడ్‌కు అనుగుణంగా 110 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయడం మొదలుపెట్టారు. ఇదేక్రమాన నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 23 సబ్‌స్టేషన్లు(33/11) మధ్య ఇంటర్ లింకింగ్ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
వేసవిలో నిరంతరం, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు పనులు
కొనసాగుతున్నాయి. సబ్‌స్టేషన్ల మధ్య లింకింగ్ లైన్లతో ఒకచోట సమస్య వచ్చినా మరో స్టేషన్ నుంచి సరఫరా ఇవ్వొచ్చు. వేసవి లోడ్‌కు అనుగుణంగా సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించాం.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ


