వెంకటరెడ్డి సేవలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

వెంకటరెడ్డి సేవలు మరువలేనివి

Mar 5 2026 7:21 AM | Updated on Mar 5 2026 7:21 AM

కామేపల్లి: మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మాజీ మంత్రి 10వ వర్ధంతి సందర్భంగా బుధవారం కొత్తలింగాల క్రాస్‌లోని ఆయన విగ్రహానికి వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్‌ డైరెక్టర్‌ రాంరెడ్డి గోపాల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడడమేకాక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు, పార్టీకి సేవలు చేశారని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగిన వెంకట్‌రెడ్డి ఆశయ సాధనకు కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కోరారు. ఇల్లెందు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌మిత్ర, నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, చరణ్‌రెడ్డి, మానుకొండ రాధాకిషోర్‌, జగన్నాథరెడ్డి, గింజల నర్సింహారెడ్డి, మేకల మల్లిబాబుయాదవ్‌, ధనియాకుల హన్మంతరావు, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రెడబోతు గోపీరెడ్డి పాల్గొన్నారు.

సస్యరక్షణ చర్యలతో

కత్తెర పురుగు కట్టడి

కూసుమంచి: మండలంలోని జుజుల్‌రావుపేటలో పలువురు సాగు చేసిన మొక్కజొన్న పంటను బుధవారం జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య పరిశీలించారు. ప్రస్తుతం పంటను కత్తెర పురుగు ఆశిస్తున్నందున తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం కూసుమంచిలో వాలంటీర్ల ద్వారా చేపడుతున్న క్రాప్‌ బుకింగ్‌ సర్వేను పరిశీలించాక, పలు గ్రామాల్లో ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులు ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఎరువులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. అవసరానికి సరిపడా యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు

334 మంది గైర్హాజరు

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఈమేరకు బుధవారం ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్‌, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 16,923మంది విద్యార్థుల్లో 16,589మంది హాజరు కాగా 334మంది గైర్హాజరయ్యారని తెలిపారు. కాగా, రాష్ట్ర పరిశీలకుడు బి.రాజన్న జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈసీ, హెచ్‌పీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు కూడా కేంద్రాలను పరిశీలించాయని వెల్లడించారు.

టీజీఐఐసీ

జోనల్‌ మేనేజర్‌గా స్వామి

ఖమ్మం అర్బన్‌: టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌గా స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈక్రమంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తూ పారిశ్రామిక వృద్ధికి సహకరించాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement