తిరుమలాయపాలెం: మండలంలోని పాతర్లపాడు స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీలింగ్ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... ఉత్తరప్రదేశ్‌లోని ధరమ్‌పూర్ జిల్లా మైనహా గ్రామానికి చెందిన విష్ణుకుమార్(25)తో పాటు విజయ్, ఖనీరామ్ ఇళ్లలో సీలింగ్ పని చేస్తూ ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ఓ ఇంటికి సీలింగ్ చేసేందుకు బైక్‌పై వెళ్లి ఆదివారం రాత్రి తిరిగి ఖమ్మం వస్తుండగా బైక్ అదుపు తప్పింది. దీంతో కింద పడిన విష్ణుకుమార్ తీవ్రగాయాలతో మృతిచెందగా విజయ్, ఖనీరామ్‌కు తీవ్రగాయాల్యాయి. వీరిని 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏనెకుంట తండాలో మిర్చి చోరీకి యత్నం
తిరుమలాయపాలెం: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని కల్లాల్లో ఆరబోస్తే కొందరు చోరీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే వెలుగు చూశాయి. మండలంలోని ఏనెకుంట తండాకు చెందిన రైతులు బానోతు మల్సూర్, బానోతు రవి మిర్చి కోశాక సమీప అడవిలోని కల్లాల్లో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి వారు ఇంటికి వెళ్లాక అక్కడకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 15 క్వింటాళ్ల మిర్చి చోరీకి యత్నించారు. మిర్చిని రాశులుగా పోసి మరోచోటకు తరలించినా తెల్లవారడంతో తీసుకెళ్లడం సాధ్యం కాక పారిపోయినట్లు తెలిసింది. ఈమేరకు సోమవారం ఉదయం ఆరబోసిన చోట మిర్చి లేకపోవడంతో రైతులు వెతుకుతుండగా మరోచోట రాశులు ఉండడంతో చోరీ సాధ్యం వదిలేసిపోయారని గుర్తించారు.


