దుబాయ్‌లో మంత్రి తుమ్మల.. | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో మంత్రి తుమ్మల..

Mar 3 2026 7:27 AM | Updated on Mar 3 2026 7:27 AM

అక్కడి పరిస్థితులతో

తిరుగు ప్రయాణం ఒకరోజు వాయిదా

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. గతనెల 22న ఆయన అల్లుడు డాక్టర్‌ కల్యాణ్‌శేఖర్‌ వైద్యుల సదస్సు నిమిత్తం దుబాయ్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో మంత్రి తుమ్మల తన కుమార్తె మోహిని, ఇతర కుటుంబీకులతో కలిసి 23వ తేదీన దుబాయ్‌ వెళ్లారు. అయితే, కళ్యాణ్‌శేఖర్‌ మరికొద్ది రోజులు అక్కడే చికిత్స పొందాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఇంతలోనే మంత్రి తుమ్మల ఈనెల 4న భారత్‌కు తిరుగు ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేసుకున్నా, అక్కడి పరిస్థితుల కారణంగా విమానం రద్దవడంతో టికెట్‌ను ఈనెల 5వ తేదీకి మార్పు చేసినట్టు క్యాంప్‌ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంత్రి దుబాయ్‌లో చిక్కుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదని, పరిస్థితుల దృష్ట్యా ప్రయాణం వాయిదా పడిందే తప్ప ఇబ్బందులు లేవని తెలిపారు.

స్పీడ్‌ పోస్టు ద్వారా భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు

ఖమ్మంగాంధీచౌక్‌: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామ కల్యాణాన్ని నేరుగా వీక్షించలేని భక్తుల ఇళ్ల వద్దే తలంబ్రాలు అందిస్తామని తపాలా శాఖ ప్రటించింది. ఇందుకోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అధికారులతో తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతరాలయ అర్చన కల్యాణ తలంబ్రాలైతే రూ.450, ము త్యాల తలంబ్రాల కోసం రూ.151ను పోస్టాఫీసుల్లో చెల్లిస్తే స్పీడ్‌ పోస్టు ద్వారా నేరుగా ఇంటి వద్ద అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణం జరగనుండగా, 20వ తేదీవరకు బుకింగ్‌కు అవకా శం కల్పించారు. కల్యాణానికి నేరుగా వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వి.వీరభద్రస్వామి ఓ ప్రకటనలో సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రులకూ రిజిస్ట్రేషన్‌

ఖమ్మవైద్యవిభాగం: క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలని డీఎంహెచ్‌ఓ డి.రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఉద్యోగులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే ప్రభుత్వ పీహెచ్‌సీలు, ఆస్పత్రులకు కూడా రిజి స్ట్రేషన్‌ చేయించాలన్నారు. సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న ఆస్పత్రుల్లో ప్రతీ కేసును పరిశీలించి సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని సూచించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సి న్‌ ఈనెల 4వతేదీ నుంచి వేసేలా సిద్ధం కావాల ని తెలిపారు. పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలా ఎవరైనా ఉంటే టెలీమానస్‌ 14416 నంబర్‌కు ఫోన్‌ చేస్తే నిపుణులు సలహాలు ఇస్తారని తెలిపారు. అనంతరం అదనపు డీఎంహెచ్‌ఓ చందూనాయక్‌ గర్భిణీ సీ్త్రల నమోదు, వ్యాక్సినేషన్‌, ఎన్‌సీడీ మందుల పంపిణీ, ఎండాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వివిధ విభాగాల అధికారులు అరుణాదేవి, వి.సుబ్రహ్మణ్యం, నవీన్‌కుమార్‌, అన్వర్‌, ప్రగతి పాల్గొన్నారు.

నేడు మద్యం

దుకాణాల బంద్‌

ఖమ్మంక్రైం: హోలీ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ ఒక ప్రకటనలో సూచించారు. బహింరంగా ప్రదేశాల్లో గొడవలు జరగకుండా నిఽరోధించడానికి ఈ నిర్ణయం అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లఘించినా, అక్రమంగా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement