అంబేడ్కర్‌భవన్ వద్ద ఉద్రిక్తత..
ఖమ్మంఅర్బన్: నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూమిలో గూడు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు తాత్కాలికంగా అంబేడ్కర్ భవన్‌లో వసతి కల్పించిన విషయం విదితమే. ఆదివారం సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రాకేశ్‌దత్త అనే యువకుడు మరో యువకుడితో కలిసి నిర్వాసితులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైరా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువకుడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిర్వాసితులు యువకుడికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టూటౌన్, రఘునాథపాలెం సీఐల ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దీక్షకు దిగిన యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ముందస్తుగా అదుపులోకి..
రఘునాథపాలెం: కలెక్టరేట్ వద్ద భూదాన్ బాధితులతో కలిసి ఆందోళన చేపట్టేందుకు వస్తున్నట్లు సమాచారం అందడంతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీపీఐ (ఎంఎల్) పార్టీకి చెందిన మధుతో పాటు పలువురు నేతలు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వారిని తహసీల్దార్ వద్ద హాజరు పరిచి, బైండవర్ చేసినట్లు సీఐ వివరించారు.


