ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమర్పించిన విద్యా విధానపత్రం–2026ను అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని యూటీఎఫ్ భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ సిఫారసుల్లో కొన్ని ప్రభుత్వ విద్యారంగానికి మేలు చేసేవిగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులకు సంబంధించి అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. జాతీయ విద్యా కమిషన్ (కొఠారి కమిషన్) సూచనలకు భిన్నంగా సిఫారసు చేశారని, ఉపాధ్యాయ సంఘాలు సాధించుకున్న అరకొర సౌకర్యాలను కూడా కమిషన్ చాలా ఎక్కువ అనే దృష్టితో వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్స్ రద్దు, వంద శాతం ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల్లో యాభై శాతం రద్దు, ఉపాధ్యాయుల పదోన్నతులకు పనితీరును కొలమానంగా తీసుకోవాలనే సిఫారసులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


