లక్ష్యం చేరేనా..?
వార్షిక ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులు
ఇప్పటివరకు సాధించింది 81 శాతమే
లక్ష్యసాధనకు మిగిలింది నెల రోజులే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించుకున్నా.. అది కూడా చేరడానికి సింగరేణి ఆపసోపాలు పడుతోంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల మాత్రమే గడువు ఉండగా.. అంచనాలకు మించి పని చేస్తేనే లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుందన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.
19 శాతం లోటు
ఈ ఆర్థిక సంవత్సరం 2025 – 26కు సంబంధించి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి ముగిసే నాటికి 64.68 మిలియన్ టన్నుల బొగ్గు రావాల్సి ఉండగా 19 శాతం లోటుతో 52.70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలిగారు. ఉత్పత్తిలో సింహభాగం వచ్చే రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఉపరితల గనుల్లో ఓబీ పనులు ఆశించిన మేర జరగకపోవడం ఇందుకు కారణమని కార్మికులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆయా గనుల్లో ఓబీ పనుల్లో వేగం పెంచినా 19 శాతం లోటు పూడ్చుకోవడం కష్టమనే అభిప్రాయం అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఖాతాలో జమ కాని ‘నైనీ’
ఈ వార్షిక సంవత్సరంలో కొత్తగూడెంలోని వెంకటేశ్‌ఖని మెగా ఓపెన్‌కాస్ట్(ఓసీ) నుంచి ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. జవహర్‌ఖని(ఇల్లెందు), గోలేటి(బెల్లంపల్లి) ఓసీలు గడిచిన మూడేళ్లుగా అనుమతుల దశలోనే మగ్గిపోతున్నాయి. సింగరేణి ఎంతో నమ్మకం పెట్టుకున్న నైనీ(ఒడిశా) గని బొగ్గు ఉత్పత్తికి రెడీగా ఉంది. అయితే, రవాణా వ్యవస్థలో చిక్కుముడులు సంస్థకు ఇబ్బందిగా మారాయి. దీంతో ఈ గని నుంచి సాలీనా వచ్చే 10 మిలియన్ టన్నుల బొగ్గు ఈసారి కూడా సింగరేణికి ఖాతాలో జమ కాలేదు.
సత్తుపల్లి ఒక్కటే..
సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో ఫిబ్రవరి 27నాటికి కేవలం సత్తుపల్లి ఏరియాలోనే 101 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైంది. కొత్తగూడెం, మణుగూరు, బెల్లంపల్లి, రామగుండం–1 ఏరియాల్లో 90 శాతానికి మించి ఉత్పత్తి జరిగింది. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా అడ్రియాల గని బొగ్గు ఉత్పత్తిలో చివరి స్థానంలో నిలిచింది. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 11 శాతమే ఇక్కడ ఉత్పత్తి జరిగింది. ఈ గనిలో వరుసగా నష్టాలు వస్తున్నా.. వాటిని తగ్గించేందుకు సంస్థ తీసుకుంటున్న జాగ్రత్తలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. గనులు, కార్మికులు ఎక్కువగా ఉన్న శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం, భూపాలపల్లి ఏరియాల్లో రాబోయే నెల రోజుల్లో లక్ష్యానికి మించి ఉత్పత్తి చేస్తేనే లోటు భర్తీ అవుతుంది. లేదంటే మరోసారి లక్ష్యానికి ఆమడ దూరంలోనే సింగరేణి నిలిచిపోయే అవకాశముంది.
బొగ్గు ఉత్పత్తిలో
సింగరేణి వెనుకబాటు


