వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి

వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి

ఆయన ఒక అద్భుతమైన

వక్త, రచయిత

అమ్మను పరభాషలో పిలిస్తే శవంతో సమానం

క్రమశిక్షణే అత్యున్నత పదవులకు సోపానం

వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఖమ్మంమయూరిసెంటర్‌/ఖమ్మంమామిళ్లగూడెం :

మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, అద్భుతమైన వక్త, రచయిత, కవి, ప్రజాస్వామ్యవాది, గొప్ప దేశభక్తుడు అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొనియాడారు. ఖమ్మం ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావుతో కలిసి అక్షర నీరాజనం పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, పీఠాల కోసం వాజ్‌పేయి ఎప్పుడూ రాజీపడలేదని, ఓటమిని సైతం హుందాగా స్వీకరించారని తెలిపారు. ప్రపంచ దేశాల ఆంక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్‌ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి అని ఉద్ఘాటించారు. దేశంలో ఒకే విధానం ఉండాలనే శ్యామప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. వాజ్‌పేయి పాలనా దక్షత, నిస్వార్థ సేవ నేటి తరానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. గతంలో జనసంఘ్‌, కమ్యూనిస్టు, కాంగ్రెస్‌, స్వతంత్ర పార్టీ వంటి రాజకీయ పక్షాలకు నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉండేవని, నేటి రాజకీయాల్లో అవి పూర్తిగా లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రసార మాధ్యమాలు కూడా వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యతను సమాజానికి మేలు చేసే విషయాలకు ఇవ్వడం లేదని అన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. పరభాషా పదమైన అమ్మను సూచించే ఆంగ్ల పదం వాడితే వస్తుప్రదర్శనశాలలో పెట్టే శవం అని అర్థం వస్తుందని, అమ్మ అని పిలవడంలో ఉన్న కమ్మదనం ఆంగ్ల పదాల్లో ఏమాత్రం లేదని అన్నారు. హిందుత్వం అంటే ఒక ఇరుకై న మతం కాదని, ఎవరినీ ద్వేషించని ఒక గొప్ప జీవన విధానమని అన్నారు. నిత్యం యోగా, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శారీరక ధారుడ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు కశ్మీర్‌ సమస్యపై మాట్లాడేందుకు ఆయనను ఐక్యరాజ్యసమితికి పంపడం దేశ ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనమని అన్నారు. కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన ఖమ్మం వాసి వెంకటేశ్వరరావును అభినందించారు. కార్యక్రమంలో వాజ్‌పేయి శతజయంతి ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మందడపు ప్రభాకర్‌ రెడ్డి, సామాజిక సమరసత జాతీయ కళా విభాగం కన్వీనర్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అప్పల ప్రసాద్‌, ప్రొఫెసర్‌ కసిరెడ్డి వెంకటరెడ్డి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement