భూదాన్ భూములు పేదలకే చెందాలి
ఖమ్మంమామిళ్లగూడెం: భూదాన్ భూములు అంటేనే పేదల కోసమని, అవి వారికి మాత్రమే చెందాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఖమ్మం సమీపాన వెలుగుమెట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించాక మాట్లాడారు. గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అన్నారు. కూల్చిన ప్రాంతంలోనే బాధితులకు ఇళ్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 62 ఎకరాల భూదాన్ భూముల్లో సెంట్ కూడా పోకుండా పేదలకు చెందేవరకు పోరాటం చేస్తానని తెలిపారు. కాగా, అక్రమంగా భూదాన్ భూముల్లో పట్టాలు చేసి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 14 వేల ఎకరాలు, నల్లగొండలో 12 వేలు, మహబూబ్‌నగర్‌లో 15 వేలు, ఖమ్మంలో 6 వేల ఎకరాలు.. ఇలా మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు. అలాంటప్పుడు ఖమ్మంలోనే పేదలు గూడు కట్టుకుంటే ఎందుకంత కక్షో ప్రభుత్వం చెప్పాలని మల్లన్న సూచించారు. పేదల నుంచి లాక్కున్న భూమిని బిల్డర్లకో, కబ్జాదారులకో కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. బీసీల ఓట్లు కావాలి కానీ వారి జీవితాలను మాత్రం నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాగా, బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తక్షణ సాయం కింద ప్రతీ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నేత వట్టె జానయ్యయాదవ్ తదితరులు ఉన్నారు.
బాధితులను పరామర్శించిన
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న


