ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?
ఖమ్మంమయూరిసెంటర్: కూలీ పనులు చేసుకుంటూ కూడబెట్టుకున్న సొమ్ముతో కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని వామపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం వివిధ పార్టీల నాయకులు నున్నా నాగేశ్వరరావు, దండి సురేష్, ఆవునూరి మధు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఖమ్మం భూదాన్ భూముల్లో పదేళ్ల క్రితం నిరుపేదలు పట్టాలు పొంది 600మంది నివసిస్తుండగా వారి ఇళ్లను కూల్చివేయడంతో రోడ్డున పడ్డారని తెలిపారు. 2014నుంచి బడా బాబుల భూములను క్రమబద్ధీకరిస్తున్న ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇదేసమయాన ఇళ్లు కూల్చివేసిన ప్రభుత్వం ఆక్రమణలు జరిగియనా చెబుతూ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. రూ.250 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న వారు మిగతా స్థలం ఏమైందో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ సాయుధ పోరాటం, ముదిగొండ భూపోరాటం వంటి వాటితో పేదలకు ఇళ్లు, స్థలాలు, భూములు సాధించిన కమ్యూనిస్టు పార్టీలను తక్కువ చేయాలని చూసే వారు చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు వై.విక్రం, మేకల శ్రీనివాస్, ఆవుల అశోక్, పాముల మోహన్, రాజు, జి.మస్తాన్, శంకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
వామపక్ష నాయకుల ఆగ్రహం


