ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భూమి చుట్టూ హద్దులు
మరోపక్క భూమి చుట్టూ
ఫెన్సింగ్ ఏర్పాటు
అధికార – ప్రతిపక్షాల మధ్య
కొనసాగిన మాటల యుద్ధం
వివరాల సేకరణకు సర్వే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో మొదలైన మాటల మంటలు చల్లారడం లేదు. శుక్రవారం ఓవైపు అధికార యంత్రాంగం బాధితుల వివరాల సేకరణలో నిమగ్నం కాగా.. వీరికి న్యాయం చేయాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా స్పందించడంతో అధికార, ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం కొనసాగింది. అలాగే, సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బాధితులను పరామర్శించారు. ఇక శనివారం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు బాధితులను పరామర్శిస్తారని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు.
అధికారుల సర్వే
భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన వారి వివరాలను సేకరించే పనిని రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. నిజమైన నిరుపేదలు ఎవరనేది గుర్తించేందుకు సర్వేను చేపడుతున్నారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం రెవెన్యూ ఉద్యోగులు టీటీడీసీతోపాటు అంబేద్కర్ భవన్‌లో ఉన్న బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆరా తీయడంతో పాటు ప్రాంతాల వారీగా అక్కడి రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు కారేపల్లి మండల వాసులు భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటే.. ఆ వ్యక్తులు వివరాలను కారేపల్లి తహసీల్దార్‌కు పంపించారు. అక్కడి ఉద్యోగులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు నెంబర్, పిల్లలు ఎందరు, గతంలో ప్రభుత్వం నుంచి పథకాలు అందాయా, స్వగ్రామంలో ఇల్లు ఉందా.. ఆర్థిక పరిస్థితి తదితర వివరాలను సేకరించనున్నారు.
వాద.. ప్రతివాదాలు
భూదాన్ భూముల వ్యవహారంలో పార్టీల నేతల నడుమ వాద, ప్రతివాదాలు తారాస్థాయికి చేరాయి. గురువారం కేటీఆర్ పర్యటన తర్వాత మాటల యుద్ధం పెరుగుతోంది. కేటీఆర్ వ్యాఖ్య లపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మరో సమావేశంలో మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలని, పేదల ఇళ్లు కూల్చడం సరైన చర్య కాదంటూ వ్యాఖ్యానించారు. ఇక వామపక్ష నేతలు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అలాగే బీఆర్‌ఎస్ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కేటీఆర్ పర్యటన సందర్భంగా బాధితులను రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక శనివారం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భూదాన్ భూముల బాధితులను వేర్వేరుగా పరామర్శించనున్నారు.
వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో
నిర్మాణాలను ఈనెల 24న తొలగించగా, చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని
నిర్ణయించారు. ఇప్పటికే హద్దులు
నిర్ధారించగా, గోతులు తవ్వి ఫెన్సింగ్ రాళ్లు పాతే పనులు మొదలుపెట్టారు. తద్వారా భూముల్లోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. కాగా, శుక్రవారం బాధితులెవరూ ఇక్కడకు రాకపోవడంతో నిశ్శబ్దం రాజ్యమేలింది. కేవలం ఫెన్సింగ్ వేస్తున్న కూలీలతో పాటు శిథిలాల్లో సామగ్రి ఏరుకునే వారే కనిపించారు.
భూదాన్ బాధితుల వివరాల సేకరణలో యంత్రాంగం
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత తర్వాత అక్కడ నివాసం ఉన్న వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే చేపడుతున్నాం. సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లాలోని 14మంది తహసీల్దార్లను ఆదేశించాం. సర్వేలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అర్హులకు ప్రభుత్వ ఆదేశాలతో నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఉంటుంది. తొలగించిన ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు స్వస్థలాల్లో
అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలి.
– అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్, ఖమ్మం
ఎవరెవరు.. ఎక్కడెక్కడ?


