‘లైన్’ మారుతోంది...
ఇవీ నష్టాలు
● విజయవాడ రైల్వే డివిజన్‌లోకి మధిర సెక్షన్ ● ప్రతీ పనికి ఉద్యోగులు అటే వెళ్లక తప్పని పరిస్థితి ● భవిష్యత్‌లో పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేసే అవకాశం?
మధిర ఇంజనీరింగ్ సెక్షన్ ఏర్పడి 65ఏళ్లు అవుతోంది. ఇప్పుడు మధిరను విజయవాడ డివిజన్‌లో కలపాలని తీసుకున్న నిర్ణయం బాధ కలిగిస్తోంది. సొంత రాష్ట్రం వదిలి వెళ్తున్న భావన వస్తోంది. ప్రజలు, ఉద్యోగుల మేలు కోసం మధిరను సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలి.
– మోదుగు సైదులు, రైల్వే ఉద్యోగి, మధిర
మధిర: మధిర రైల్వేస్టేషన్ ఇప్పటివరకు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. అయితే, ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి విజయవాడ డివిజన్‌లోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మధిరతో పాటు తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్లు ఆ డివిజన్‌లో విలీనమవుతాయి. ఏపీకి సరిహద్దుగా ఉన్న ఈ స్టేషన్ల ద్వారా నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టికెట్ల అమ్మకాలతోనే మధిర స్టేషన్‌కు నెలకు సుమారు రూ.30 లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు డివిజన్‌ను మార్చడం ద్వారా కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే కొనసాగుతాయి. ఫలితంగా రైల్వే ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా సికింంద్రాబాద్ బదులు విశాఖపట్నం లేదా విజయవాడ వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు.
హాల్టింగ్‌పై ప్రభావం
మధిర సహా మూడు స్టేషన్లను సౌత్ కోస్టల్ జోన్‌లో విలీనం చేయడం ద్వారా మధిర స్టేషన్‌లో ఆగుతున్న పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేసే అవకాశం ఉంది. డివిజన్ మార్పులో భాగంగా 533/0 కి.మీ.గా ఉన్న మధిర సెక్షన్ పరిధి 525/0 వరకు తగ్గిపోతుంది. ఫలితంగా మూడు స్టేషన్లు ఏపీలోని విజయవాడ డివిజన్‌లోకి వెళ్తాయి. మధిర రైల్వేస్టేషన్‌కు దశాబ్దాల చరిత్ర ఉన్నందున తెలంగాణలోని సికింద్రాబాద్ డివిజన్‌లోనే కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
త్వరలోనే కొత్త జంక్షన్లు
భవిష్యత్‌లో ఎర్రుపాలెం, మోటమర్రి రైల్వే జంక్షన్లుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. ఎర్రుపాలెం నుంచి అమరావతి కి రైల్వేలైన్ నిర్మాణం ఆమోదించడంతో ఎర్రుపాలెం జంక్షన్ అవుతుంది. తద్వారా మధిరలో పలు రైళ్లకు హాల్టింగ్ తొలగించి ఎర్రుపాలెంలో ఇస్తారు. అంతేకాక మోటమర్రి కూడా జంక్షన్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ స్టేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. మధిర స్టేషన్‌కు కొద్ది కి.మీ. దూరంలోనే ఎడమ వైపు ఎర్రుపాలెం, కుడివైపు మోటమర్రి జంక్షన్లు ఏర్పడితే మధిర స్టేషన్ బోసిపోయే అవకాశముంది. ఇక ఇప్పుడు డివిజన్ కూడా మారిస్తే ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యల కోసం నానా పాట్లు పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాక టికెట్ల ద్వారా స్టేషన్‌కు వస్తున్న రోజువారీ రూ.లక్ష ఆదాయం, వాహనాల పార్కింగ్, స్టాళ్ల టెండర్ల రుసు ము కూడా విజయవాడ డివిజన్‌కే జమ అవుతుంది.
ఇంకొన్ని సమస్యలు
మధిర, తొండలగోపవరం, ఎర్రుపాలెం స్టేషన్ల్లను విజయవాడ డివిజన్‌కు మార్చడం ద్వారా ఉద్యోగుల కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే కొనసాగుతాయి. మధిరలో ఆగాల్సిన రైళ్లలో మార్పులు వచ్చి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఏదైనా సమస్య వస్తే విజయవాడకు వెళ్లాల్సి వస్తుంది. ఇక మధిర రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు కలగానే మిగిలిపోతాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని డివిజన్ మార్చకుండా ఎంపీలు చొరవ తీసుకోవాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు.
మధిర స్టేషన్‌లో ఏదైనా రైలుకు హాల్టింగ్ కల్పించాలన్నా, ప్రయాణికులకు సమస్యలు ఎదురైనా స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ దృష్టికి తీసుకెళ్తారు. ఆపై వారు సికింద్రాబాద్ జోన్ రైల్వే జనరల్ మేనేజర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. కానీ ఇప్పుడు డివిజన్ మారితే ప్రజాప్రతినిధులకు దృష్టికి సమస్యలను తీసుకెళ్తాక వారు నూతనంగా ఏర్పడే విశాఖపట్నం జనరల్ మేనేజర్‌తో మాట్లాడాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల వినతులపై ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ రైల్వే ఉన్నతాధికారులు కానీ పెద్దగా స్పందించే అవకాశం ఉండదు. ఇప్పటికే పద్మావతి, కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే మార్గాన మధిర రైల్వేస్టేషన్‌లో ఆగుతున్నా తిరుగు ప్రయాణంలో ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం లేదు. ఇలాంటి సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోతాయి.
‘లైన్’ మారుతోంది...


