వరి వెదజల్లే పద్ధతిపై శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతి యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ భారతీయ వరి పరిశోధన కేంద్రం నుంచి ప్రిన్సిపల్ సైంటిస్టులు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ పద్మావతి హాజరవగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహేంద్రకుమార్, పద్మావతి మాట్లాడుతూ.. వరిలో చీడపీడల నివారణ కోసం అభివృద్ధి చేసిన లింగాకర్షక బుట్టలు, జిగురట్టలు, నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, వచ్చే లాభాలు, గడ్డిని ఎలా నియంత్రించాలో వివరించారు. అభ్యుదయ రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కేవీకే ఫామ్‌లో డ్రోన్ పద్ధతిలో వరి సాగు విధానాల గురించి రైతులకు చూపించారు. గిరిజన రైతులకు డ్రమ్ సీడర్ పరికరాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆళ్లపల్లి మండలం రాయపాడు, చుంచుపల్లి మండలం పెనగడప, సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం నుంచి 80 మంది రైతులు పాల్గొన్నారు.


