పారిశుద్ధ్య పనులకు ప్రణాళిక చేపట్టాలి
సింథటిక్ ట్రాక్ పరిశీలన..
● చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్ ఏర్పాటు ● ఆస్తి పన్ను చెల్లించని భవన యజమానులపై చర్యలు ● కేఎంసీ సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంమయూరిసెంటర్ : నగర పాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గతంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌తో కొంతమేర సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. కలెక్టరేట్‌లో కేఎంసీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త రవాణా వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్ ఉండాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థలో కొనుగోలు చేస్తున్న నాలుగు స్వీపింగ్ వాహనాలను త్వరగా తీసుకొచ్చేలా చూడాలన్నారు. నగరంలో బ్రిడ్జిపై అనుమతి లేకుండా ప్రచార హోర్డింగులు, పోస్టర్లు పెట్టవద్దని, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని హోర్డింగులు, పోస్టర్లను తొలగించాలని, అలా పెట్టే వారికి జరిమానా విధించాలని సూచించారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు..
నగరంలో మంజూరైన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులు పూర్తిచేయాలని, పర్యవేక్షణకు డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, పురోగతిపై ప్రతీ వారం నివేదిక సమర్పించాలని చెప్పారు. మార్చి మొదటి వారం నాటికి ఫుట్ పాత్ పనులు పూర్తి చేయాలన్నారు.
పన్నులు చెల్లించకుంటే చర్యలు..
నోటీసులు జారీ చేసినా ఆస్తి పన్ను చెల్లించకపోతే భవన యజమానులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిఫాల్టర్లను గుర్తించి నీటి సరఫరా నిలిపివేయాలని, వాణిజ్య సముదాయాల పన్ను చెల్లించకపోతే వ్యాపారుల లైసెన్సులు రద్దుచేయాలని అన్నారు. అక్రమ నిర్మాణాలను అనుమతించవద్దన్నారు. ఎస్టీపీల నిర్మాణానికి అవసరమైన భూములను ఈనెల 15 నాటికి అప్పగిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఏఎంసీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ వద్ద నిఘా ఉండాలి
ఖమ్మం సహకారనగర్: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం ఆయన గోడౌన్‌ను తనిఖీ చేశారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. ఆయన వెంట ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎం.ఏ. రాజు, డీటీ అన్సారి, ఆర్‌అండ్‌బీ డీఈ లఖన్‌నాయక్, ఏఈ లలిత ఉన్నారు.
ఖమ్మం స్పోర్ట్స్ : నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్లతో ఏర్పాటవుతున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనులను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా రంగాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఐఎస్‌ఓ నిబంధనల ప్రకారం పనులు చేయాలని, వర్షపునీరు నిల్వ ఉండకుండా వన్ సైడ్ కార్బోచాంబర్లు, సరిపడా వెలుతురు ఉండేలా హైమాస్ట్ లైట్లు అమర్చాలని చెప్పారు. స్టేడియంలో పచ్చదనాన్ని పెంచేందుకు పొగడ మొక్కలు నాటాలన్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. స్టేడియంలో అందుబాటులో ఉన్న టేబుల్ టెన్నిస్ హాల్, రన్నింగ్ ట్రాక్, ఇతర క్రీడా సదుపాయాలను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడలు మరింత పెరగా ల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఎస్‌ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డీఈ నవీన్, మున్సిపల్ ఉద్యానవన అధికారిణి రాధిక, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ.గౌస్, డీఎస్‌ఏ మేనేజర్ ఉదయ్‌కుమార్, ఆదర్శ్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు.


