విద్యుత్‌ ఫెన్సింగ్‌ కట్టడిపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఫెన్సింగ్‌ కట్టడిపై దృష్టి

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

విద్య

విద్యుత్‌ ఫెన్సింగ్‌ కట్టడిపై దృష్టి

పంటల రక్షణ కోసం ఏర్పాటుచేస్తున్న రైతులు ఫలితంగా అటవీ జంతువులతో పాటు జనానికి ముప్పు నష్టాలపై అవగాహన కల్పిస్తున్న విద్యుత్‌ అధికారులు

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

ఖమ్మంవ్యవసాయం: అడవి జంతువుల నుంచి పంటలకు రక్షణ పేరుతో ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ ఫెన్సింగ్‌ కట్టడిపై విద్యుత్‌ అధికారులు దృష్టి సారించారు. ఈ ఫెన్సింగ్‌ జంతువులకే కాక మనుషులకు ప్రాణాంతకంగా మారుతున్న నేపథ్యాన నియంత్రించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోన్నారు. ఇదే సమయాన ప్రత్యామ్నాయంగా సోలార్‌ ఆధారిత ఫెన్సింగ్‌, గార్డింగ్‌, ఇతర విధానాలు అవలంబించేలా అవగాహన కల్పించనున్నారు.

సులువు కావడంతో...

పలు చోట్ల పంటలను అడవి జంతువులు పాడు చేస్తుండడంతో పొలాల చుట్టూ రైతులు విద్యుత్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయిస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ, పండ్ల తోటలు, కూరగాయల పంటలకే కాక వరి చేన్లకు అడవులు సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటుచేయించడం సర్వసాధారణమైంది. కొందరు పంటల రక్షణ కోసం.. ఇంకొందరు అటవీ జంతవుల వేట కోసం ఏర్పాటుచేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఇందుకోసం విద్యుత్‌ లైన్ల నుంచి అనధికారికంగా వైర్లు అనుసంధానించి ఫెన్సింగ్‌కు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌ లైన్లకు కర్రలు, బొంగుల సాయంతో వైర్లను తగిలిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఫెన్సింగ్‌ కారణంగా అటవీ జంతువులే కాక ఆవులు, గేదెలు, దుక్కిటెద్దులతో పాటు ఒక్కోసారి రైతులు, కూలీలు కూడా మరణిస్తున్నారు. గత ఏడాది కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన మేకల కాపరి కరుణాకర్‌ మరణించాడు.

సురక్షిత విధానాలు

పంటలను పశుపక్షాదుల నుంచి రక్షించుకునేందుకు అనేక విధానాలు చర్యలు అందుబాటులోకి వచ్చాయి. పండ్ల తోటలు, మొక్కజొన్న చేలు, వేరుశనగ పంటల రక్షణ కోసం సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. సోలార్‌ ఆధారిత ఫెన్సింగ్‌, గార్డింగ్‌, ఇతర సురక్షిత పద్ధతులను వినియోగించుకునే అవకాశం ఉన్నందున అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్‌ ఫెన్సింగ్‌తో నష్టాలు, ఎదురయ్యే చట్టపరమైన చర్యలను వివరిస్తూనే సురక్షిత మార్గాలపై రైతులకు అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

పంటల రక్షణ పేరిట విద్యుత్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుచేయడం చట్టరీత్యా నేరం. విద్యుత్‌ లైన్ల నుంచి నేరుగా కనెక్షన్‌ ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీల ద్వారా ఇలాంటి వారిని గుర్తిస్తాం. ప్రజలు కూడా అక్రమంగా విద్యుత్‌ వినియోగించే వారి వివరాలను అందించాలి.

– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ

విద్యుత్‌ ఫెన్సింగ్‌ కట్టడిపై దృష్టి1
1/1

విద్యుత్‌ ఫెన్సింగ్‌ కట్టడిపై దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement