బంగారు ఆభరణాలు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాలు అప్పగింత

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

బంగారు ఆభరణాలు అప్పగింత

బంగారు ఆభరణాలు అప్పగింత

ఖమ్మంక్రైం: వైద్యం కోసం ఖమ్మం వచ్చి ఆభరణాలు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఆభరణాలు దక్కేలా పోలీసులు చేసిన కృషి ఫలించింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల గ్రామానికి చెందిన గుగులోత్‌ లక్‌పతి ఖమ్మంలో ఆస్పత్రికి గురువారం రాగా, ఆయన వద్ద 35 గ్రాముల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆయన డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో ఖమ్మం టూ టౌన్‌ పోలీసు ఉద్యోగులు డి.శ్రీను, టి.భీముడు రంగంలోకి దిగారు. లక్‌పతి తిరిగిన ఆస్పత్రి, మెడికల్‌ షాప్‌ ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా మెడికల్‌ షాప్‌లో ఆభరణాలు మరిచిపోయినట్లు తేలింది. దీంతో వాటిని ఎస్‌ఐ రమేష్‌ సమక్షాన బాధితుడికి అప్పగించడంతో కృతజ్ఞతలు తెలిపాడు.

సంత ఆవరణలో వ్యక్తి..

కామేపల్లి: మండలంలోని పండితాపురం సంత ఆవరణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన లావుడ్యా బాలు(55) బుధవారం సంతకు వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. తిరిగి రాత్రి ఇంటికి చేరకపోవడంతో ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియరాలేదు. గురువారం ఉదయం సంత ఆవరణలోని షెడ్డులో ఆయనను స్థానికులు గుర్తించగా, కుటుంబీకులు వచ్చి పరిశీలించే సరికే బాలు మృతి చెంది ఉన్నాడు. ఆయన అతిగా మద్యం తాగి నీరు, ఆహారం లేక మృతి చెంది ఉంటాడని బాలు కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

ప్రైవేటు చిట్టీ నిర్వాహకుడిపై కేసు

ఖమ్మంఅర్బన్‌: డబ్బు చెల్లించకుండా మోసం చేసిన ప్రైవేట్‌ చిట్టీ నిర్వాహకుడిపై ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఖానాపురానికి చెందిన తోటకూర విజయలక్ష్మి ప్రైవేట్‌గా చిట్టీలు నడిపే బోనం ప్రసాద్‌ వద్ద నెలకు రూ.25 వేల చొప్పున 19 నెలల పాటు కిస్తీలు చెల్లించింది. ఆమెకు రూ.5లక్షల మేర చెల్లించాల్సి ఉన్నా ప్రసాద్‌ తప్పుడు కారణాలు చూపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్‌ తెలిపారు.

బస్టాండ్‌లో యాచకుడు మృతి

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన యాచకుడు సత్తుపల్లి బస్టాండ్‌లో శుక్రవారం మృతి చెందాడు. కాకర్లపల్లికి చెందిన భూక్యా శ్రీను(50) కొంతకాలంగా ప్రయాణికులను యాచిస్తూ బస్టాండ్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన ఆయన మృతి చెందాడు. ఈమేరకు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించగా, బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్సై ప్రదీప్‌ తెలిపారు.

గంజాయి స్వాధీనం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని గురువారం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. భద్రాచలం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద ఓ కారులో సోదా చేయగా, రూ.10.73లక్షల విలువైన 15.070 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులు రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన రఘు, రాజస్థాన్‌కు చెందిన శేఖర్‌ రామ్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement