బస్సులో వస్తుండగా రూ.20 వేల నగదు మాయం
నేలకొండపల్లి: వైద్యపరీక్షల నిమిత్తం బస్సులో ఖమ్మం వస్తున్న ఓ వ్యక్తి వద్ద ఉన్న రూ.20వేల నగదు చోరీ జరిగిందని సమాచారం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన వి.సైదులు బుధవారం ఖమ్మం వచ్చేందుకు కోదాడలో బస్సు ఎక్కాడు. బస్సు నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి వచ్చేసరికి ఆయన జేబులో ఉన్న రూ.20వేలు లేకపోవడంతో కండక్టర్‌కు చెప్పగా బస్సును నేరుగా నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈమేరకు ప్రయాణికుల వద్ద, బస్సులో పోలీసులు తనిఖీ చేసినా డబ్బు లభించకపోవడంతో కోదాడలోనే చోరీ జరిగి ఉంటుందని భావిస్తూ అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించగా వెళ్లిపోయారు.
మత్స్యసహకార సొసైటీపై విచారణ
కారేపల్లి: మండలంలోనిదుబ్బతండా మత్స్య సహకార సొసైటీలో అనర్హులుగా సభ్యులుగా కొనసాగుతున్నందున రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈవిషయమై ఇటీవల కలెక్టర్‌కు పిర్యాదు అందడంతో ఆయన ఆదేశాల మేరకు మత్స్యశాఖ ఏడీ శివప్రసాద్, తహసీల్దార్ అనంతుల రమేష్ బుధవారం ఇరువర్గాలను విచారించారు. మండలంలోని గేటుకారేపల్లి రెవెన్యూ పరిధి మేకలతండా, దుబ్బతండాకు చెందిన తుమ్మలకుంట, సంగెంకుంట చెరువులకు సంబంధించి 2011వ సంవత్సరంలో 19మంది సభ్యులతో సొసైటీ ఏర్పడింది. అయితే, నిబంధనల ప్రకారం చెరువుల విస్తీర్ణం లేకున్నా సొసైటీ ఏర్పాటుచేశారని, పట్టా భూమి లోని కుంటలో అనుమతి లేకుండా చేపపిల్లలు పోశారంటూ అధికారుల విచారణలో పలువురు వివరించారు. అంతేకాక సొసైటీ సభ్యులు ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రికల్ కాంటాలు అమ్ముకున్నారని పేర్కొగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక సభ్యులు మాత్రం తాము చేపల వేటపైనే జీవనం సాగిస్తున్నందున సొసైటీని రద్దు చేయొద్దని కోరారు. ఈమేరకు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఏడీ శివప్రసాద్ మాట్లాడుతూ నివేదికను కలెక్టర్‌కు అందించి ఆయన ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేటీపీఎస్ ఉద్యోగి మృతికి సంతాపం
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన తేజావత్ బాసు(57) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాసు పాల్వంచ కేటీపీఎస్‌లో జేపీఏ, ఓడీఎస్ అండ్ టీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆయన మరో మూడేళ్లలో పదవీ విరమణ చేయనుండగా మృతి చెందడంపై పలువురు సంతాపం తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.సర్పంచ్ ధీరావత్ అశోక్‌రాణి, ట్రాన్స్‌కో డీఈఈ ధీరావత్ కోటేశ్వరరావు, నాయకులు ధీరావత్ రాధాకృష్ణమూర్తి, బాలాజీ, తేజావత్ రామదాసు పాల్గొన్నారు.


