ఆర్టీసీకి మేడారం జాతర!
అందరి సహకారంతోనే...
● రీజియన్‌కు భారీగా రాబడి ● రూ.3.28 కోట్లకు పైగా ఆదాయంతో రికార్డు
ఖమ్మంమయూరిసెంటర్: భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న వనదేవతలు సమ్మక్క – సారలమ్మ తల్లులు ఆర్టీసీకి సైతం వరాలు కురిపించారు! ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క జాతర ఇటీవల ములుగు జిల్లా మేడారంలో జరగగా భక్తులను చేరవేసిన ఆర్టీసీకి గణనీయమైన ఆదాయం సమకూరింది. గత నెల 27 నుండి ఈ నెల 2వ తేదీ వరకు ఖమ్మం రీజియన్ నుంచి మేడారానికి అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. ముందస్తు ప్రణాళికలతో రీజియన్‌లో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటుచేయగా తల్లుల గద్దెల సమీపానికి బస్సులు వెళ్లడంతో భక్తులు అధికసంఖ్యలో ఆర్టీసీనే ఆశ్రయించారు. దీంతో రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు కాసుల వర్షం కురిసింది.
రెండు లక్షల మంది ప్రయాణం
మేడారం జాతర కోసం ఖమ్మం రీజియన్ నుంచి 214 బస్సులు కేటాయించారు. ఈ బస్సులు మొత్తం 2,039 ట్రిప్పులు తిరగగా 2,03,863 మంది భక్తులు రాకపోకలు సాగించారు. రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్‌ను ఏర్పాటుచేసి 24 గంటలు సర్వీసులు నడిపించడం ద్వారా రీజియన్‌కు ఏకంగా రూ.3,28,39,181 ఆదాయం సమకూరింది. కొత్తగూడెం డిపో రూ.1,07,02,941 ఆదాయంతో మొదటి స్థానాన నిలిచింది. కాగా, రీజియన్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 85 శాతంగా నమోదు కావడం విశేషం.
మేడారం జాతరలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా సర్వీసులు ఏర్పాటు చేశాం. పాయింట్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సులు సమకూర్చాం. భక్తులతో పాటు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా బస్సులు నడపగలిగాం.
– ఏ.సరిరామ్, ఖమ్మం రీజినల్ మేనేజర్
ఆర్టీసీకి మేడారం జాతర!


