ఒక్కటైన వలస కూలీల జంట
నేలకొండపల్లి: పొట్టకూటి కోసం రాష్ట్రం దాటి వచ్చిన ఓ యువతీ, యువకుడు ప్రేమించుకోగా స్థానిక రైతులు వారి పెద్దలను ఒప్పించి వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు పలువురు నేలకొండపల్లి మండలంలోని మోటాపురంలో ఏటా నాలుగు నెలల పాటు మిర్చి ఏరేందుకు వస్తారు. ఇందులో పూల్‌సింగ్, ఆశ ఉండగా వీరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో మోటాపురానికి చెందిన సోదరులైన రైతులు భూక్యా మోహాన్‌రావు, భూక్యా లక్ష్మణ్ వారి తల్లిండ్రులతో ఫోన్‌లో మాట్లాడి ఒప్పించారు. అంతేకాక పెళ్లి ఖర్చులు, భోజనం ఇతరత్రా అన్నీ భరించి సోమవారం వీరన్నస్వామి ఆలయంలో కల్యాణం జరిపించారు. సీపీఐ మండల కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు భాగం నరసింహారావు, మూడు శ్రీనుతో పాటు రైతులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.


