దక్కేది ఎవరెవరికో?!
టికెట్ల పోరు
● కాంగ్రెస్ అభ్యర్థులకు నేడు బీ ఫామ్‌ల పంపిణీ ● రెబల్స్‌ను బుజ్జగించే పనిలో అభ్యర్థులు, కీలక నేతలు ● ఉపసంహరణే లక్ష్యంగా చర్చలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డు స్ఢానాలకు గాను 768 మంది అభ్యర్థులు 779 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఆదివారం ఎనిమిది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఏడుగురు విత్ డ్రా చేసుకోగా, వీరిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఎస్‌పీ, బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఇక కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి అభ్యర్థి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యాన రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక, బీ–ఫామ్‌ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు బీ–ఫామ్‌లను సోమవారం అందిస్తామని మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ ప్రకటించంచడంతో అభ్యర్థులెవరో తేలనుంది.
వ్యూహాత్మక అడుగులు
పార్టీ ప్రకటించిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండేలా అసంతృప్తులను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా రెబల్స్‌ను దారికి తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎవరైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నామినేషన్ వెనక్కి తీసుకుంటారో వారికి భవిష్యత్‌లో ప్రాధాన్యత ఉంటుందనే హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ నుండి బీ–ఫామ్ వస్తుందని సంకేతాలు ఉన్న అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే, మరో పక్క అసమ్మతివాదులను కలుపునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సమయం లేదు మిత్రమా...
ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
జరగనుండగా, 9వ తేదీ సాయంత్రానికి ప్రచారం ముగించాలి. కానీ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కడా ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. రెబల్స్‌ను బుజ్జగించడంపై అటు నేతలు, ఇటు అభ్యర్థులు దృష్టి సారించడంతో ప్రచారంపై ఇంకా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సోమ, మంగళవారం మధ్యాహ్నంకల్లా ఈ ప్రక్రియ ముగించి ఆతర్వాత ప్రచార రంగంలో దూసుకెళ్లాలనే భావనతో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయినప్పటికీ ప్రచారానికి ఆరు రోజులకు మించి సమయం లేని కారణంగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థులకు సోమవారం బీ–ఫామ్‌లు ఇవ్వనుండగా, అందులో ఎదురుదెబ్బ తిన్న బలమైన నేతలకు బీ ఫామ్ ఇవ్వాలనే యోచనలో మిగతా పార్టీల నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో మంగళవారం కల్లా అన్నిచోట్ల పార్టీల వారీగా అభ్యర్థులెవరో తేలుతుందని చెబుతున్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. అధికార పార్టీ కావడంతో కౌన్సిలర్లుగా పోటీకి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా వైరా మున్సిపాలిటీలో 20వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 92 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. ఇక మధిరలో 22 వార్డులకు 86, ఏదులాపురంలో 32 వార్డులు ఉండగా 82, సత్తుపల్లిలో 23 వార్డులు ఉండగా 50, కల్లూరులో 20 వార్డులకు 64 మంది నామినేషన్లు వేశారు. ఇందులో వార్డులో ఒక్కొక్కరికే బీ ఫామ్ ఇవ్వనుండగా.. మిగతా వారిని బుజ్జగించడంపై నేతలు దృష్టి సారించారు.


