సమరానికే సై!
కాంగ్రెస్ ఒంటరిపోరు..
ఏదులాపురం, ఇల్లెందు, సత్తుపల్లి, కల్లూరులోనూ అదే పరిస్థితి
మధిర, వైరాలో రెండు పార్టీల మధ్య అనిశ్చితి
అశ్వారావుపేటలో కాంగ్రెస్, సీపీఎం దోస్తీ
మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌తో సీపీఎం జత
సాక్షిప్రతినిధి, ఖమ్మం : పుర పోరు బరిలో తగ్గేదేలే అన్నట్టుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ సమరానికి సై అంటున్నాయి. ఒంటరిగా గెలుస్తామనుకున్న చోట కాంగ్రెస్ బరిలోకి దిగుతుండగా.. అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు బీఆర్‌ఎస్ పొత్తుల అస్త్రాలతో కదులుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 3తో ముగియనుండగా.. ఎవరు ఏ దారిలో వెళ్తున్నారనేది ఇప్పటికే తేలింది. ఉపసంహరణల నాటికి అటుఇటుగా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సీపీఐ చెరోదారి పట్టాయి. రెండు పార్టీల మధ్య పొత్తుకు బ్రేక్ పడడంతో ఒంటరిపోరు ఖాయమైంది.
అక్కడ తలోదారి..
కొత్తగూడెం కార్పొరేషన్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. కార్పొరేషన్‌గా ఏర్పాటైన అనంతరం తొలి ఎన్నికలు కావడంతో పాలకవర్గాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఇక్కడ సీపీఐతో కలిసి కాంగ్రెస్ పోటీకి దిగుతుందని ముందునుంచి జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. పొత్తులు కుదరకపోవడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. కాంగ్రెస్ తరఫున ఆశావహులు అన్ని డివిజన్లకు నామినేషన్లు వేశారు. సీపీఐ కూడా బలమున్న చోట నామినేషన్లు వేసింది. ఇక బీఆర్‌ఎస్, సీపీఎం ఇక్కడ కలిసి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలూ కొలిక్కి రాలేదు. చివరకు బీఆర్‌ఎస్ ఒంటరిగా బరిలో నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది.
పొత్తుల కోసం బీఆర్‌ఎస్ చర్చలు..
ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్.. సీపీఎం, సీపీఐ, బీసీ సంఘాల జేఏసీతో చర్చలు కొనసాగిస్తోంది. నేడో రేపో చర్చలు కొలిక్కి రానున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మధిరలో బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తు ఖరారైంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల్లోనూ బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీకి దిగాయి. ఏదులాపురంలో బీఆర్‌ఎస్, సీపీఎం పొత్తుతో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఒంటరి పోరుకు సై అంటోంది. ఈ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో తేలనుంది. ఇక అశ్వారావుపేటలో కాంగ్రెస్ – సీపీఎం కలిసి ముందుకు సాగుతున్నాయి.
మధిర, వైరాలో ప్రతిష్టంభన..
మధిర, వైరా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రూపుల వారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక నేతలు పోటీకి సై అంటూ తమ అనుయాయులతో నామినేషన్లు వేయించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇలా ఉండగా.. సీపీఐతో పొత్తుల అంశంపై ఏకాభిప్రాయానికి రాలేదు. పొత్తు ఉంటుందా లేదా అన్నది తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయే అనే అభిప్రాయం రెండు పార్టీల శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నామినేషన్ల ఉపసంహరణల నాటికి ఈ రెండు మున్సిపాలిటీల్లో పొత్తుపై స్పష్టత రానుంది.
ఏదులాపురం, సత్తుపల్లి, ఇల్లెందు, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా చేయించుకున్న సర్వేల్లో మెజార్టీ వార్డులు దక్కుతాయన్న రిపోర్టు రావడంతో ఆ దిశగా సొంత బలంతో పోటీలో నిలుస్తున్నట్లు సమాచారం. మొత్తంగా మిగితా పార్టీలతో పొత్తుల చర్చలు కూడా చేయకుండా తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. ఉపసంహరణల నాటికి బీ ఫారాలు కూడా అందనుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఇక పలు వార్డుల నుంచి కొంతమంది ఆశావహులు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. వీరిని బుజ్జగించేందుకు ముఖ్య నేతలు ఈ రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ పెట్టుకున్నారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ చెరో దారి
సమరానికే సై!


