రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా
ఏదులాపురంలో అన్ని డివిజన్లూ
క్లీన్ స్వీప్ చేస్తాం
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి
ఖమ్మంరూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, భోజనం చేసేప్పుటు ఒకటి రెండు మెతుకులు జారిపడినట్టు.. ఒకటి, రెండు సీట్లు అటూఇటు అయినా మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25వ వార్డుల్లో శనివారం ఆయన విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లలో ఏదులాపురం మున్సిపాలిటీలోని 32 డివిజన్లలో రూ.19.74 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, సెంట్రర్ లైటింగ్ పనులు చేపట్టామని అన్నారు. మున్నేరు వరద బాధితుల శాశ్వత పరిష్కారానికి రూ.680 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీకి కొత్త హంగులతో రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి పునరుద్ఘాటించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా ఎఫ్‌సీఐ గోడౌన్‌ను ఇక్కడి నుంచి తరలించే బాధ్యత తనదేనని చెప్పారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలను చెప్పే వారిని నమ్మొద్దని, అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థులు వెలుగు సైదమ్మ,, వేమిరెడ్డి శివదేవి, బోయిన కుమారి, కడవ నవీన్‌కుమార్, బాణోత్ భాస్కర్, నాగేంద్రప్రసాద్, బాణోత్ దివ్య, పూల్‌చంద్, నాయకులు బాణోత్ కిషోర్, తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


