పరిశుభ్రమైన నగరంగా అభివృద్ధి చేస్తాం
ఖమ్మంఅర్బన్ : ఖమ్మం నగరాన్ని శుభ్రమైన, సకల సౌకర్యాలు గల నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 6, 7 డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అమృత్ పథకం కింద రూ.200 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) కింద రూ.250 కోట్లు మంజూరు చేసి నగర మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా విలీనమైన పంచాయతీల్లో రహదారులు, డ్రెయిన్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. గోశాల ప్రాంతానికి వెళ్లే రహదారిని విస్తరిస్తామన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఖమ్మాన్ని ముందంజలో నిలిపామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యం మెరుగ్గా ఉండడంతో ఇతర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు ఖమ్మంలో స్థిరపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు, మేయర్ నీరజ, తహసీల్దార్ సైదులు, పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, దొంగల సత్యనారాయణ, కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


