ప్రభుత్వ పాఠశాలలో డీఈఓ విచారణ
కొణిజర్ల: మండలంలోని బోడియాతండా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై డీఈఓ చైతన్యజైనీ శనివారం విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో వాడిన పదార్థాలు, గుడ్లు తదితర వివరాలపై ఆరా తీశారు. డీఈఓతో పాటు విచారణ అధికారులుగా తహసీల్దార్ నారపోగు అరుణ, తల్లాడ ఎంఈఓ దామోదర ప్రసాద్ వ్యవహరించారు. విచారణ నివేదికను విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, కలెక్టర్‌కు అందించనున్నట్లు డీఈఓ తెలిపారు. కాగా, భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో హెచ్‌ఎం మురళీకృష్ణ తప్పు లేదని, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ అనుదీప్‌ను కోరినట్లు తెలిసింది.


