విద్యావంతుల నిలయం | - | Sakshi
Sakshi News home page

విద్యావంతుల నిలయం

Jan 31 2026 7:15 AM | Updated on Jan 31 2026 7:15 AM

విద్య

విద్యావంతుల నిలయం

● పాలేరు ‘నవోదయ’కు నేటితో 38ఏళ్లు ● 6నుంచి 12వ తరగతి సీబీఎస్‌ఈ విధానంలో బోధన ● ఉన్నతస్థానాలకు చేరిన పలువురు పూర్వవిద్యార్థులు విద్యార్థుల భవితే మా లక్ష్యం...

● పాలేరు ‘నవోదయ’కు నేటితో 38ఏళ్లు ● 6నుంచి 12వ తరగతి సీబీఎస్‌ఈ విధానంలో బోధన ● ఉన్నతస్థానాలకు చేరిన పలువురు పూర్వవిద్యార్థులు

కూసుమంచి: జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయ నిలుస్తోంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి విద్యాలయ కీర్తిని చాటుతున్నారు. ఈవిద్యాలయం ఏర్పడి 38 ఏళ్లు పూర్తికాగా.. సీటు దక్కించుకుంటే చాలు విద్యార్థుల భవితకు అండగా నిలుస్తోంది. దీంతో నవోదయలో సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు.

గ్రామీణప్రాంత విద్యార్థులకు వరం

గ్రామీణప్రాంతాల విద్యార్థులను నాణ్యమైన విద్యనందించేలా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నవోదయ విద్యాలయాలను ప్రకటించారు. ఈమేరకు 1986లో పాలేరు రిజర్వాయర్‌ సమీపంలో సుమారు 27 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విద్యాలయాన్ని స్థాపించగా 1988 జనవరి 30న నాటి చిన్న నీటి పారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి భవనాలను ప్రారంభించారు. ఇందులో సీబీఎస్‌ఈ విధానంలో 6నుంచి 12వ తరగతి వరకు బోధన జరుగుతుండగా, ఏటా ఆరో తరగతిలోలోకి పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో ఒకేరీతిన జరుగుతుంది. ఇక్కడి విద్యావిధానం, క్రమశిక్షణ, వసతులు విద్యార్థి జీవితాలను మలుపు తిప్పేలా ఉండడంతో నవోదయ విద్యాలయం విద్యార్థులకు దేవాలయంగా విలసిల్లుతోంది. అంతేకాక జాతీయ సమైక్యత పెంపు, త్రిభాషా సూత్రాన్ని పక్కాగా అమలు చేయడంలో కీలకంగా నిలుస్తోంది.

ఉన్నత స్థానాలకు ఎదుగుతూ..

పాలేరు నవోదయ విద్యాలయలో చదివిన ఎందరో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులు, విద్యాలయ గర్వపడే స్థాయికి చేరారు. పూర్వ విద్యార్థుల్లో శ్రీలక్ష్మి, పాపయ్య, వినయ్‌కుమార్‌, గాంధీ తదితరులు ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇంకా పలువురు వైద్యులుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత స్థాయికి చేరారు.

ఆల్‌ రౌండర్లుగా విద్యార్థులు...

నవోదయ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలు, కళలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో రాణిస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధించారు. అంతేకాక పాలేరు నవోదయ కూడా జాతీయస్థాయి పోటీలకు వేదికగా నిలిచింది. ఏటా ప్రతీ డిసెంబర్‌ళో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తుండగా పలువురు హాజరై నేటి విద్యార్థుల దిక్సూచిలా నిలుస్తున్నారు.

పాలేరు నవోదయ విద్యాలయలో చదివిన ఎందరో ఉన్నతులుగా ఎదిగారు. ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజిక, సేవా రంగాల్లో ముందు నిలుస్తున్నారు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి వారి భవితకు బంగారు బాటలు వేయడమే నవోదయ లక్ష్యం. ఆ దిశగా పాలేరు విద్యాలయను ముందు వరుసలో నిలిపేలా కృషి చేస్తున్నాం. – కె.శ్రీనివాసులు, ప్రిన్సిపాల్‌

విద్యావంతుల నిలయం 1
1/2

విద్యావంతుల నిలయం

విద్యావంతుల నిలయం 2
2/2

విద్యావంతుల నిలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement