●ఏం జరుగుతోంది ?
నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థుల కుటుంబీకులే కాకుండా బంధువులు, అనుచరులతో ర్యాలీగా కేంద్రాల వద్దకు వచ్చారు. నిర్ణీత దూరంలోనే అందరినీ నిలిపివేసి అభ్యర్థి, ప్రతిపాదకులనే లోనకు పంపించారు. ఇలా వెళ్లిన అభ్యర్థి వచ్చేవరకు సత్తుపల్లిలోని కార్యాలయం వద్ద అనుచరులు వేచి ఉండగా.. అటుగా వెళ్తున్న ఓ మహిళకు విషయం తెలియక తన వాహనాన్ని ఆపి ఆసక్తిగా ఆరా తీయడం కనిపించింది.
ఆలసించిన ఆశాభంగమే..
మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అంతకు ఐదు నిమిషాల ముందు సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని ‘మరో ఐదు నిమిషాల్లో గడువు ముగుస్తోంది.. ఆశావాహులు ఉంటే వెంటనే రావాలి’ అని మైక్ ద్వారా ప్రకటించారు. సరిగ్గా 5గంటలు కాగానే గేట్లు మూసేసి లోపల ఉన్న వారి నామినేషన్లు మాత్రం స్వీకరించారు.


