రండీ.. ప్రచారం చేసుకోండి
ఇది మంచి అవకాశం
● తపాలా శాఖ ఆధ్వర్యాన ‘మీడియా పోస్టు’ సేవలు ● ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రైవేట్ కంపెనీల ప్రచారానికి అవకాశం ● పోస్టాఫీసుల్లో బ్యానర్లు, పోస్టర్లు, ఎల్‌ఈడీల ద్వారా ప్రచారం
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ‘మీడియా పోస్టు’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ సేవలు, ఉత్పత్తులను ప్రచారం చేసుకునేలా ఈ విధానం ద్వారా అవకాశముంటుంది. పోస్టాఫీసుల ఆవరణలో బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించడమే కాక ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రచారానికి అవకాశం కల్పిస్తారు. అంతేకాక పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, మనీ ఆర్డర్ ఫామ్స్, ఇతర స్టేషనరీపై కంపెనీల బ్రాండ్లను ముద్రించుకోవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించే ఈ విధానం కొంతకాలంగా అమల్లో ఉన్నా ఎక్కడికక్కడ పోస్టాఫీసుల స్థాయిలో ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి...
పోస్టాఫీస్‌ల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల, కార్పొరేట్ సంస్థల ఉత్పుత్తులపై ప్రచారానికి తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. ఖమ్మం పోస్టల్ డివిజన్ వ్యాప్తంగా లేదా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం హెడ్ పోస్టాఫీసులు, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, మధిర, సత్తుపల్లిలోని ఏదో ఒక పోస్టాఫీస్, ఇతర సబ్, బ్రాంచ్ పోస్టాఫీసుల్లోనూ ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఈమేరకు సంస్థల ఉత్పత్తులు, సేవల వివరాలతో బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేసుకోవచ్చు. అంతేకాక ఎల్‌సీడీ/ ఎల్‌ఈడీల తెరల ద్వారా ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం బోర్డుల, బ్యానర్ల సైజు ఆధారంగా రుసుము చెల్లించాలి. ఖమ్మం పోస్టల్ డివిజన్ పరిధిలో ఆసక్తి ఉన్నవారు గాంధీచౌక్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(99897 48758), పబ్లిక్ రిలేషన్ విభాగం ఉద్యోగి(98660 32213)ని సంప్రదించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలు, ఉత్పత్తుల ప్రచారానికి తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే పోస్టాఫీసుల్లో మంచి ప్రచారం లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బాధ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వి.వీరభద్రస్వామి,
పోస్టల్ సూపరింటెండెంట్, ఖమ్మం


