మున్సిపాలిటీగా..
వీర నది.. వైరా నదిగా
మేజర్ జీపీ నుంచి
● 2018లో వైరా మున్సిపాలిటీ ఆవిర్భావం ● శివారు గ్రామాలను కలుపుతూ 20 వార్డులు ● నిజాం కాలంలోనే ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం
వైరా: జాతీయ రహదారిపై ఉన్న వైరా మేజర్ గ్రామపంచాయతీ 2018 ఆగస్టు 2వ తేదీన మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ సమయాన రాష్ట్రంలోని పలు మేజర్ జీపీలను అప్‌గ్రేడ్ చేయడంతో వైరాకు స్థానం దక్కింది. అంతకుముందు 17 నెలలు, మున్సిపాలిటీ ఏర్పడ్డాక కొద్దినెలలు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఆతర్వాత 2020లో మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ సమయాన చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా అప్పట్లో బీఆర్‌ఎస్‌లో ఉన్న సూతకాని జైపాల్ ఎన్నికయ్యారు.
మున్సిపాలిటీ స్వరూపం ఇలా..
వైరా పట్టణంతో పాటు గండగలపాడు, సోమవరం, బ్రాహ్మణపల్లితో పాటుగా కొణిజర్ల మండలంలోని దిద్దిపూడి, లాలాపురం, పల్లిపాడు గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఇక్కడ 36వేల మంది జనాభా, 24,689 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి వేయి మంది ఓటర్లు పెరిగారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను 45 వేలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి.
పంచాయతీ సర్పంచ్‌లు వీరే..
వైరా మేజర్ పంచాయతీగా, అంతకుముందు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు పలువురు సర్పంచ్‌లు అభివృద్ధికి కృషి చేశారు. 1954 నుండి 61వరకు సాతులూరి సంపత్‌కుమార్, 1961 – 64లో శాఖమూరి సీతరామయ్య, 1964 – 70 వరకు ఖాజా నాగభూషణం, 1970 – 81 వరకు చింతనిప్పు నర్సయ్య, 1981 – 88 వరకు కేతినేని సత్యనారాయణ, 1988 – 95లో టీఎస్.ప్రసాద్ సర్పంచ్‌లుగా గెలిచారు. ఇక 1995 నుంచి 2000 వరకు బొర్రా పద్మావతి, 2001 – 2006లో పువ్వాళ్ల దుర్గాప్రసాద్, 2006 – 2011 వరకు బొర్రా వెంకటేశ్వర్లు, 2011 – 2016 వరకు బానోతు వాలీ సర్పంచ్‌గా పని చేశారు. ఆపై వైరా మున్సిపాలిటీ ఏర్పడగా రెండో పాలకవర్గం ఎన్నిక ప్రస్తుతం జరగనుంది.
జిల్లాలోనే వైరాకు ప్రత్యేక చరిత్ర ఉంది. 1920కు పూర్వం ఇక్కడ వీరనది ఉండేదని.. అది కాస్త కాలక్రమేణా ప్రస్తుత వైరా నదిగా మారిందని చెబుతారు. నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ హయాంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న వైరా రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. 1923లో ప్రారంభమైన ఈ నిర్మాణం 1930లో పూర్తయింది. అప్పట్లో ఈ రిజర్వాయర్‌కు రూ.30.90 లక్షలు వెచ్చించారు.


