కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

Jan 29 2026 6:13 AM | Updated on Jan 29 2026 6:13 AM

కమనీయ

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నయనానందకరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, దేవస్థానానికి అనుబంధంగా ఉన్న రంగనాయక ఉపాలయంలో ఫిబ్రవరి 1న రంగనాయక స్వామి తిరుకల్యాణోత్సవం ఉంటుందని ఈఓ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. గురువారం ఆలయ హుండీలను లెక్కించనున్నామని పేర్కొన్నారు.

తలనీలాల సేకరణ.. రూ.1.27కోట్లు

భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ టెండర్‌ అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్‌కు చెందిన ఎ.పుల్లారెడ్డి రూ.1.27 కోట్లకు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కాంట్రాక్ట్‌ ఆయనకు దక్కనుంది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో

డీఎంహెచ్‌ఓ తనిఖీ

వైరా/కల్లూరు: వైరాలోని ఆదిత్య డెంటల్‌ క్లినిక్‌, హరిత డెంటల్‌ క్లినిక్‌తో పాటు కల్లూరులోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను డీఎంహెచ్‌ఓ రామారావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యులు వివరాలు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తప్పని సరిగా పాటించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌, వైద్యాధికారి నవ్యకాంత్‌ తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.

తెలంగాణ జట్టు విజయం

ఖమ్మం స్పోర్ట్స్‌: ఇందిరాగాంధీ ఇన్విటేషన్‌ మహిళల టీ–20 జాతీయ క్రికెట్‌ టోర్నీ కొనసాగుతోంది. ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న టోర్నీలో భాగంగా బుధవారం తెలంగాణ – తమిళనాడు జట్ల మధ్య మ్యాచ్‌లో తెలంగాణ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ జట్టు 209 పరుగులు చేయగా, అన్షు సహాని 69 బంతుల్లో 87 పరుగులు సాధించారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు జట్టు 64 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. అలాగే విదర్భ–మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌లో విదర్భ, ఢిల్లీ–ఆంధ్రప్రదేశ్‌ మధ్య మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. తొలుత క్రీడాకారులను కాంగ్రెస్‌ నాయకులు తుమ్మల యుగంధర్‌, టోర్నీ నిర్వాహకులు ఎండీ.మతిన్‌, జానీపాషా పరిచయం చేసుకుని మ్యాచ్‌లను ప్రారంభించారు.

హైవే పనులను

అడ్డుకున్న రైతులు

ఖమ్మం అర్బన్‌: నాగపూర్‌–అమరావతి జాతీయ రహదారి పనులను చింతకాని మండలం వందనం సమీపాన రైతులు బుధవారం అడ్డుకున్నారు. ఖమ్మం నగరానికి సమీపాన ఈ ప్రాంతం ఉన్నా భూములు కోల్పోతున్న తమకు సరైన పరిహారం చెల్లించడం లేదని పేర్కొన్నారు. పరిహారం పెంచడంతోపాటు పునరావాసంపై స్పష్టత వచ్చేవరకు రోడ్డు పనులు చేపట్టవద్దని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం రూరల్‌ మండలం తీర్థాల నుంచి రఘునాథపాలెం మండలం వీవీపాలెం వరకు, వీవీపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు భూసేకరణపై హైకోర్టు స్టే ఆర్డర్‌ అమల్లో ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రతినిధులు సూచించారు.

కమనీయం..  రామయ్య నిత్యకల్యాణం1
1/2

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

కమనీయం..  రామయ్య నిత్యకల్యాణం2
2/2

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement