సాగర్ కాల్వలో మృతదేహం
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపాన బోనకల్ బ్రాంచ్ కాల్వలో ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. ఈ విషయమై స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో బయటకు తీయించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత ఆచూకీ కోసం ఆరా తీస్తుండగా ఖమ్మం గోపాలపురం ఎల్‌బీ నగర్‌లో నివాసముండే వెల్డర్ నల్లాని బద్రినాధ్(38)గా గుర్తించారు. ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా రామచంద్రంపేటకు చెందిన ఐదేళ్లుగా ఖమ్మంలో నివాసముంటున్నాడు. కాగా, భద్రినాధ్ ఈనెల 26నుంచి కానరాకుండా పోగా బుధవారం మృతదేహం లభ్యమైంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం గడ్డికుంట తండాకు చెందిన రైతు తేజావతి లాలు(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖమ్మంలో పనులు ముగించుకొని బుదవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మరో ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన లాలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
ఉరి వేసుకుని బలవన్మరణం
శరీరంపై సీపీఎం జెండాతో ఆత్మహత్య
ఎర్రుపాలెం: మండల కేంద్రానికి చెందిన రేఖా దుర్గయ్య(60) అలియాస్ కొండ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసిన ఆయన నాలుగేళ్ల క్రితం భార్యతో గొడవపడి గ్రామంలోనే వేరేఇంట్లో నివసిస్తున్నాడు. ఈక్రమాన మద్యానికి బానిసవడంతో పాటు మానసిక స్థితి సరిగా లేక తిరుగుతున్నాడు. ఈమేరకు కేజీబీవీ ఎదుట వాటర్ ట్యాంక్ మెట్లకు వైర్‌తో ఉరి వేసుకుని మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఆయన కుమారుడు గోపికృష్ణ చూసి ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.రమేష్‌కుమార్ తెలిపారు. కాగా, సీపీఎం సానుభూతిపరుడైన దుర్గయ్య ఆత్మహత్య చేసుకున్న సమయాన ఆ పార్టీ జెండాను శరీరంపై కట్టుకోవడం గమనార్హం.
బ్యాటరీల దొంగలు అరెస్ట్
రూ.2.16 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
రఘునాథపాలెం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బ్యాటరీల చోరీ కేసుల్లో నిందితులను బుధవారం రఘునాథపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించిన వివరాలు... ఎస్‌ఐ జి.నరేష్, సిబ్బంది బుధవారం ఉదయం జింకల తండా క్రాస్ రోడ్డులో తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన కారులో ఉన్న ఇద్దరు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో వారి ని వెంబడించి పట్టుకోగా జిల్లా కోర్టు ఆవరణలోని జనరేటర్ నుంచే కాక పలు చోట్ల వాహనాల్లో బ్యాటరీలు చోరీ చేసినట్లు అంగీకరించారు. వీరిలో పెనుబల్లి మండలం రామచంద్రపురానికి చెందిన ఎస్‌కే.అక్బర్, బల్లేపల్లికి చెందిన షేక్ సైదులు ఉండగా, రూ.2.16లక్షల విలువైన బ్యాటరీలు, గ్యాస్ సిలిండర్ తది తర సామగ్రిని స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాగర్ కాల్వలో మృతదేహం


