బుల్డోజర్లతో వస్తామని బెదిరింపులు
సత్తుపల్లి: సత్తుపల్లి–రేజర్ల డైవర్షన్ రహదారి నిర్మాణానికి సింగరేణి, రెవెన్యూ అధికారులు అనుసరిస్తున్న తీరు వివాదస్పదమవుతోంది. భూమి, చెట్లకు పరిహారం చెల్లించాలని బాధితులు ఆందోళన చేస్తుంటే.. అధికారులు దౌర్జన్యంగా భూముల్లోకి బుల్డోజర్లతో వచ్చి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారని మందపాటి కృష్ణారెడ్డి, శీలపురెడ్డి రాధిక తదితరులు వాపోతున్నారు. ఈక్రమంలోనే బుధవారం రెవెన్యూ, సింగరేణి ఉద్యోగులు రాగా, స్థానికులతో కలిసి ప్రతిఘటించే సరికి రాత్రి మళ్లీ వస్తామంటూ హెచ్చరించి వెళ్లారని తెలిపారు. అసింగరేణి స్వాధీనం చేసుకున్న భూముల సర్వే నంబర్లు తప్పుగా పడడంతో ఏడుగురు రైతులు పరిహారానికి దూరమయ్యారు. ఇందులో మందపాటి కృష్ణారెడ్డికి చెందిన రేజర్ల రెవెన్యూ సర్వే నంబర్ 88లో 30 కుంటల భూమి ఉంటే.. 15 కుంటలు రోడ్డు పనుల్లో పోయింది. కానీ పాస్‌పుస్తకంలో సర్వే నంబర్ 794 ప్రభుత్వ భూమిగా నమోదు కావడంతో కోర్టును ఆశ్రయించగా, సరిచేసి పరిహారం చెల్లించాలనే ఆదేశాలు వచ్చినా భూమి స్వాధీనానికి యత్నిస్తున్నారని ఆరోపించాడు. ఎప్పుడు పడితే అప్పుడు పొక్లెయినర్లు, బుల్డోజర్లతో వచ్చి వృద్ధ దంపతులమని చూడకుండా బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఇక శీలపురెడ్డి రాధికకు నాలుగు కుంటల ఇళ్ల స్థలం వ్యవసాయ భూమిగా చూపించడంతో పరిహారం తక్కువగా వచ్చింది. దీంతో ఆమె ఇంటి వరకు ఫెన్సింగ్ వేయించి అధికారుల చుట్టూ తిరుగుతోంది.
రూ.7.5 కోట్ల వరకు నష్టం
ఈ రోడ్డు నిర్మాణానికి సేకరించే భూమిలో ఎస్‌కె ఖదీర్‌పాషా ఎకరం మేర ఉండగా, అందులోని 576 శ్రీగంధం, 58 మలబార్, 46 టేకు చెట్లను అటవీశాఖ అనుమతి లేకుండా తొలగించారని వాపోయాడు. ఫలితంగా రూ.7.50 కోట్ల మేర నష్టం ఎదురైందని తెలిపాడు. పదిహేనేళ్ల క్రితం మొక్కలు నాటగా, మరో పదేళ్లలో రూ.కోట్లల్లో లాభాలు వచ్చేవని, ఇంతలోనే తొలగించినందున అటవీశాఖ లెక్కించిన విధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
సింగరేణి, రెవెన్యూ అధికారుల నిర్వాకం


