మామిడి పూతకు మంచు దెబ్బ
ట్యాంకర్ల ద్వారా పిచికారీ
● చల్లని వాతావరణం, విపరీతమైన మంచుతో రాలుతున్న పూత ● అక్కడక్కడా ఆశిస్తున్న తెగుళ్లు ● సస్యరక్షణ చర్యలపై అధికారుల సూచనలు
ఖమ్మంవ్యవసాయం/తల్లాడ: మామిడిలో పూత, కాయ ఎదుగుదలకు తక్కువ వర్షపాతం, తక్కువ తేమ అవసరం. ఇవే కాయ పెరుగుదల, ఉత్పాదకతలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ కొద్దిరోజులుగా పెరుగుతున్న చలి, మంచు ప్రభావంతో మామిడిపూతపై ప్రభావం పడుతోంది. ఖమ్మం జిల్లాలో 31వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, దాదాపు అన్నిచోట్ల చెట్లు విరగబూశాయి. కానీ మంచు ప్రభావంతో పూత రాలుతుండడం, ఇతర తెగుళ్ల ఆనవాళ్లు కూడా మొదలుకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యాన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఉద్యాన, పట్ట పరిశ్రమ అధికారి ఎంవీమధుసూదన్ పలు సూచనలు చేశారు.
నీటి తడులతోనే పూత, పిందె
పూతకు రాని తోటల్లో తేలికపాటి తడులు ఇస్తే పూమొగ్గలు విచ్చుకొని పుష్పగుచ్ఛాలు ఏర్పడుతాయి. పూ మొగ్గలు పిందెలుగా మారుతున్న దశలో చెట్లకు నీరు ఇవ్వడం మొదలు పెట్టి ఎరువులు వేసుకోవాలి. క్రమం తప్పక నీటి తడులు ఇస్తే త్వరగా పిందె కడుతుంది. అంతేకాక పిందె రాలిపోకుండా కాపాడుకోవచ్చు. తోటల్లో చీడపీడల నివారణకు సమగ్ర చర్యలు తీసుకుంటూనే పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి. నీటి తడి అధికంగా కాకుండా పలుచగా ఇవ్వాలి. తెగుళ్ల నివారణకు సల్ఫర్, ఫ్లానా ఫిక్స్ స్ప్రే చేసుకోవాలి. 2.5 లీటర్ల నీటిలో ఒక ఎంఎల్ ద్రావణం కలిపి స్ప్రే చేసుకోవాలి.
కొద్దిరోజులుగా మంచు బాగా కురుస్తుండడం, ఉదయం 7 – 8 గంటల వరకు ప్రభావం ఉండడంతో మామిడి చెట్ల పూత రాలుతోంది. అంతేకాక తోటల్లో బూడిద తెగులు, తేనెమంచు పురుగు, నల్లి(తామరపురుగు) ఆశిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈమేరకు ట్రాక్టర్ల ట్యాంకర్‌లో మందులు కలిపి తోటలపై పిచికారీ చేస్తున్నారు. తద్వారా మందులు, కూలీలు, ట్రాక్టర్ ఖర్చు కలిపి ఎకరానికి రూ.10 వేల వరకు అవుతోందని రైతులు వాపోతున్నారు.
మామిడి పూతకు మంచు దెబ్బ


