ఆధ్యాత్మిక సందడి..
శ్రీసీతారామచంద్రస్వామివారి అవతారాలకు వేళాయె..
● రేపటి నుంచి భద్రాచలంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం ● 29న తెప్పోత్సవం, 30న ఉత్తరద్వార దర్శనం వేడుకలు
భద్రాచలం: భూలోక వైకుంఠంగా పిలిచే భద్రగిరి అధ్యయనోత్సవాలకు సిద్ధమైంది. రామయ్య అవతారాలతోపాటు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, విశ్వరూప సేవలను భక్తులు చూసి తరించే ఘడియలు సమీపించాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి జనవరి 12 వరకు అధ్యయనోత్సవాలు, 16న విశ్వరూప సేవ నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈనెల 20 నుంచి 29 వరకు పగల్ పత్తు, 30 నుంచి జనవరి 12 వరకు రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి.
రోజొక అవతారంలో..
పగల్‌పత్తు ఉత్సవాల్లో స్వామివారు రోజుకొకటి చొప్పున తొమ్మిది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు పవిత్ర గోదావరిలో స్వామి వారికి తెప్పోత్సవం, 30 న ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. జనవరి 16న దేవతలందరినీ ఒకేచోట కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేసే ‘విశ్వరూప సేవ’ నిర్వహిస్తారు. ఈ వేడుక భద్రాద్రి రామయ్యకు మాత్రమే ప్రత్యేకం కావడం విశేషం. కాగా వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును శ్రీ వైకుంఠంలోని ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.


