ప్రకృతి వ్యవసాయంపై అధ్యయన యాత్ర
ఎర్రుపాలెం: ప్రకృతి వ్యవసాయంలో మెళుకువలను రైతులకు వివరించేందుకు ఉద్యానవన శాఖాధికారులు అధ్యయనయాత్ర ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లాలోని పలువురు రైతులను గురువారం బస్సులో ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా గూడూరు మండలం పిన గూడూరులంక తీసుకెళ్లారు. అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విజయ్‌రామ్ క్షేత్రంలో సాగులో మెళకువలు, దిగుబడిపై వివరించారు. అగ్రి హార్టికల్చర్ సొసైటీ సలహాదారుడు నల్లమల వెంకటేశ్వరరావు, వైరా ఏడీఏ కరుణశ్రీ, ఉద్యానవన శాఖాధికారి ఆకుల వేణు, రైతులు తల్లపురెడ్డి నాగిరెడ్డి, జంగా రవీందర్‌రెడ్డి, కంచర్ల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛ్’ పాఠశాలల్లో పరిశీలన
ఖమ్మంఅర్బన్: స్వచ్ఛ్ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్ కోసం జిల్లా స్థాయిలో ఎంపికై న పాఠశాలలను రాష్ట్ర బృందం గురువారం పరిశీలించింది. తిరుమలాయపాలెం, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పరిశీలించగా రాష్ట్ర పరిశీలకుడు ఎస్.కే.సైదులు వివరాలు వెల్లడించారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, ఎకోక్లబ్ కార్యకలాపాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, అవగాహన ఆధారంగా రేటింగ్ ఇస్తామని తెలిపారు. ఆతర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాక అత్యధిక రేటింగ్ పొందిన పాఠశాలలను రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డుల కోసం ప్రతిపాదిస్తామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఖమ్మం సీఎంఓ బాజోజు ప్రవీణ్‌కుమార్, కొత్తగూడెం ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్‌కుమార్, డీఆర్‌పీ స్వరూప్‌కుమార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
120క్వింటాళ్ల బియ్యం సీజ్
ఖమ్మంఅర్బన్: ప్రజా పంపిణీకి కేటాయించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయీస్ ఖమ్మం అర్బన్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు... ఖమ్మంకు చెందిన ఏ.జగదీశ్ రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో హైదరాబాద్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ అంజయ్య నేతృత్వాన బుధవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద లారీని తనిఖీ చేయగా 50 కేజీల చొప్పున 250 బస్తాల్లో 120 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. కామేపల్లి మండలం పండితాపురం శివారులో బియ్యం లోడ్ చేసినట్లు గుర్తించి ఖమ్మం అర్బన్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు అప్పగించారు. ఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బియ్యం వ్యాపారి జగదీశ్, పండితాపురానికి చెందిన కానుగుల కృష్ణ, లారీ డ్రైవర్ మంగళగూడెంకు చెందిన ఎద్దులుపై కేసు నమోదైంది. తనిఖీల్లో ఏఎస్‌ఐ వెంకటకృష్ణ, తహసీల్దార్ బాషా, సివిల్ సప్లయిస్ డీటీ విజయబాబు, సీడీటీ వీరయ్య పాల్గొన్నారు.
బ్యాంక్ సామగ్రి జప్తు
సత్తుపల్లి: సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలతో సత్తుపల్లిలోని యూనియన్ బ్యాంక్–2వ శాఖలోని సామగ్రిని గురువారం జప్తు చేశారు. బ్యాంకు భవనం యజమాని చలసాని సాంబశివరావు పెంచిన లెక్కల ప్రకారం ఎనిమిదేళ్లుగా రూ.57 లక్షల బకాయి ఉండడంతో కోర్టును ఆశ్రయించాడు. ఈమేరకు కోర్టు ఆదేశాలతో రూ.5లక్షల విలువైన కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు, ఏసీలను జప్తు చేసి తరలించారు. కాగా, బ్యాంకు సామగ్రిని తరలిస్తుండడంతో ఖాతాదారులు వివరాలు ఆరా తీశారు. అలాగే, ఓ వ్యక్తి బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించేందుకు డబ్బు కట్టాక సామగ్రిని జప్తు చేయడంతో ఆందోళన వ్యక్తం చేశాడు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన కంచిపోగు నగేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవపడి బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆయన గురువారం ఉదయం వరకు రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా సమీప మామిడితోటలో ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంపై అధ్యయన యాత్ర


