సందఢీ
ప్రలోభాలకు వేళాయె..
ఈ గ్రామాల్లో ప్రలోభాలతో ఎర రెండో విడత పంచాయతీల్లో అభ్యర్థుల హోరాహోరీ మూడో విడతకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
పల్లెలు మైకుల హోరు.. అభ్యర్థుల హామీలతో మార్మోగిపోతున్నాయి. అన్నిచోట్లా ప్రచారం వాడివేడిగా సాగుతుండగా.. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో మంగళవారం సాయంత్రం 5గంటలతో ప్రచారానికి తెరపడింది. దీంతో ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు తెరచాటు రాజకీయాలను మొదలుపెట్టారు. ఇక రెండో విడత ఎన్నికల ప్రచారానికి 12వ తేదీ వరకు గడువు ఉండగా అభ్యర్థులు వేగం పెంచారు. మరోవైపు మూడో విడత ఎన్నికలు జరిగే చోట నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగియగా అభ్యర్థులు గుర్తులతో ప్రచారానికి సిద్ధమయ్యారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
పంచాయతీ..
చివరిరోజు చుట్టేశారు..
మొదటి విడత ఎన్నికలు కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో జరగనున్నాయి. ఆయా మండలాల్లో 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు గాను 20 గ్రామపంచాయతీలు, 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇంకో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 172 సర్పంచ్ స్థానాలు, 1,415 వార్డుల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఈ గ్రామాల్లో ప్రచారం మంగళవారం ముగియగా చివరి రోజున అభ్యర్థులు జోరు పెంచారు. ఇంటింటా ఓటర్లను కలిసి తమ గుర్తుతో ముద్రించిన కరపత్రాలు ఇస్తూ తమను గెలిపిస్తే నెరవేర్చనున్న హామీలను వివరించారు. అభ్యర్థుల తరఫున మద్దతు ఇస్తున్న పార్టీల జిల్లా స్థాయి నాయకులు రంగంలోకి దిగారు. ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు.
రెండో విడతలో నువ్వా.. నేనా!
రెండో విడత ఎన్నికలు జరిగే కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని జీపీల్లో ప్రచారం ఉధృతమైంది. ఈనెల 6న ఉపసంహరణ గడువు ముగిశాక అభ్యర్థుల సంఖ్య తేలడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక్కడ ఈనెల 14న ఎన్నికలు జరగనుండగా, 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచార గడువు ఉంది. ఆలోగా వీలైనన్ని సార్లు ఓటర్లను నేరుగా కలవడంతో పాటు గుర్తును అందరికీ తెలియచేసేలా పోస్టర్లు, మైక్‌ల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు.
ముగిసిన ఉపసంహరణలు
జిల్లాలోని ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో మూడో విడతగా ఈనెల 17న పోలింగ్ జరగనుంది. ఈ మండలాల్లోని జీపీల్లో మంగళవారం మధ్యాహ్నం ఉపసంహరణల గడువు ముగిసింది. దీంతో ఏకగ్రీవమైన జీపీలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులు ముందుగానే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఇప్పుడు గుర్తులు కూడా కేటాయించడంతో బుధవారం నుంచి మరింత ఉధృతం చేసేలా సన్నాహాలు చేసుకున్నారు.
తొలి దశ ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం ముగియడంతో అభ్యర్థుల అమ్ములపొది నుంచి నుంచి అస్త్రాలు తీసేందుకు సిద్ధహయ్యారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు షురూ చేశారు. ఇన్నాళ్లు ఓటర్లకు హామీలతో సరిపెట్టిన వారు ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలకంగా ఉన్న వారిని కలిసి పరోక్షంగా సహకరించాలని కోరుతున్నారు. అలాగే, ఓటర్లకు ఎంతో కొంత ముట్టచెప్పి తమకే ఓటు వేసేలా హామీ తీసుకుంటున్నారు. అలాగే మద్యం, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేసేలా గ్రామాల్లో డంప్ చేశారు.
మొదటి విడత జీపీల్లో ముగిసిన ప్రచారం


