విమానం ఎగిరేనా?
గరీబ్‌పేట స్థలంపై కేంద్రం కొర్రీలు
ప్రత్యామ్నాయ భూముల కోసం అన్వేషణ
త్వరగా గుర్తిస్తేనే మిగిలిన పనులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియ ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎయిర్‌పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను త్వరగా ఎంపిక చేసి, ఫీజుబులిటీ సర్వే నిర్వహిస్తేనే రాబోయే మూడేళ్లలో కొంత ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే ఎప్పటిలాగే విమానాశ్రయం ప్రకటనలకే పరిమితమవుతుంది.
రెండు దశాబ్దాల కల..
కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతు న్నాయి. గతంలో లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలక, పాల్వంచ మండలం బంగారుజాల – గుడిపాడు ప్రాంతాల్లోని భూములను పరిశీలించినా ఆ స్థలాలు అనుకూలంగా లేవని తేలింది. దీంతో ప్రభుత్వం గతేడాది కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించింది. ఆయా మండలాల పరిధిలో గరీబ్‌పేట పరిసరాల్లో 950 ఎకరాలు ఎంపిక చేసినట్లు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.
మళ్లీ మొదటికొచ్చిన కథ..
గరీబ్‌పేట పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 950 ఎకరాల స్థలాన్ని పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన టెక్నికల్ టీమ్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించింది. ఈ బృందం జనవరి 23న క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎంపిక చేసిన స్థలం సమీపంలో ఎత్తయిన గుట్టలు ఉండటం, గాలి వీచే దిశ, వేగం తదితర అంశాలు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేవంటూ ఆ బృందం ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చింది. అదే సమయంలో వరంగల్ ఎయిర్‌పోర్ట్ పురోగతిపై మార్చిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నివేదిక వెల్ల డించగా.. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ కేంద్రం ప్రకటన చేసింది. దీంతో కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
విమానాశ్రయ నిర్మాణానికి ఎంపిక చేసే ప్రదేశానికి సంబంధించిన వాతావరణ (మెటీయోరాలాజికల్) నివేదికలు, విండ్‌రోజ్ డయాగ్రమ్ తదితర సాంకేతిక అంశాలు కీలకంగా ఉంటున్నాయి. అదే విధంగా సదరు స్థలంలో ఉన్న ఎత్తయిన కొండలు, నిర్మాణాలు, వాగులతో విమాన రాకపోకలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనే అంశాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. గతంలో ఎంపిక చేసిన బంగారుజాల – గుడిపాడు విషయంలోనూ ఎత్తయిన కొండలు, కేటీపీఎస్ చిమ్నీలు ఇబ్బందిగా మారాయి. తాజాగా గరీబ్‌పేటలోనూ భౌగోళిక పరిస్థితులే అడ్డుగా నిలిచాయి. అందుకే మరోసారి స్థలాన్ని గుర్తించేప్పుడు భౌగోళిక అంశాల్లో మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికై తే పాల్వంచ, బూర్గంపాడు మండలాల పరిఽధిలో కొండలు, గుట్టలు, వాగులు లేని రెవెన్యూ స్థలాలను జిల్లా యంత్రాంగం గుర్తించినట్టు సమాచారం.
మరో సర్వే ఎప్పుడో
కొత్తగూడెం ఎయిర్‌పోర్టు అంశంపై విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో కాకుండా మరో చోట స్థలాన్ని ఎంపిక చేస్తామని, అక్కడ ఫీజుబు లిటీ సర్వే చేపట్టాలని కోరారు. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్‌సింగ్ యూనివర్సిటీ ప్రారంభం, అడ్మిషన్లు, మౌలిక వసతుల కోసం ప్రణాళిక తయారీ తదితర అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ అంశం మరుగునపడింది. ఇటీవల ఈ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ విషయంలో కేంద్రం తన స్పందనను స్పష్టం చేసింది. ఇకనైనా ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యామ్నాయ స్థలాల ఎంపికపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌పై ఏర్పాటుపై సందిగ్ధత
విమానం ఎగిరేనా?


