నేడు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మధిర చేరుకోనున్న ఆయన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశం కానున్న భట్టి హైదరాబాద్ బయలుదేరతారు.
బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపు
ఖమ్మం సహకారనగర్: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయించాలంటే బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కేటాయింపు, పెండింగ్ సీఎంఆర్ అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు సరఫరా చేసే ధాన్యం విలువకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సిందేనని తెలిపారు. కాగా, 2024–25 యాసంగి పంటకు సంబంధించి జిల్లాలో 1,07,676 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు గాను 95,100 మెట్రిక్ టన్నులు అందించారని, మిగతా బియ్యం కూడా త్వరగా అందజేయాలని సూచించారు. ఈసమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
2.20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు
నేలకొండపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లా అంతటా 2.20 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుకు అవకాశముందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని ముజ్జుగూడెంలో మొక్కజొన్న సాగుతో పాటు బోదులబండలో డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగును మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 3.5లక్షల్లో వరి సాగు కాగా, యాసంగిలో 3లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈమేరకు సరిపడా యూరియా సిద్ధం చేసి, రైతులకు ప్రత్యేక పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా పంపిణీ పారదర్శకంగా సాగుతుందని వెల్లడించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు రైతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డీఏఓ సూచించారు. నేలకొండపల్లి ఏఓ ఎం.రాధ, ఏఈఓలు పాల్గొన్నారు.
పర్యాటకుల కోసం బ్యాటరీ వాహనాలు
కల్లూరురూరల్: పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం బ్యాటరీ ఆటోలను సమకూర్చింది. ఈమేరకు రెండు ఆటోలు కల్లూరులోని అటవీశాఖ కార్యాలయానికి చేరాయి. పులిగుండాల ప్రాజెక్టును అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తుండడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యాన రాకపోకలు సులువయ్యేలా బ్యాటరీ ఆటోలను కేటాయించారు.
26లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మంగపతిరావు సూచించారు. పదో తరగతి థియరీ, ప్రాక్టికల్స్ ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు రూ.150 చొప్పున చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో లేదా మీ సేవ, టీ సేవ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు.
నేడు డిప్యూటీ సీఎం పర్యటన


