ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
విధులు సమర్థవంతంగా
నిర్వర్తించాలి
ఖమ్మం సహకారనగర్: మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఓటరు స్లిప్ సమాచారం కోసమేనని, ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తెచ్చుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఏజెంట్ల సమక్షాన మాక్ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టేలా ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా నుంచి ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామారావు మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు జరుగనున్న ఏడు మండలాల్లో విధులకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయిందని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లను సీపీ సునీల్‌దత్ వివరించగా.. వీసీలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీసీఓ గంగాధర్, ఆర్‌టీఓ వెంకటరమణ, డీపీఓ ఆశాలత, డీవైఎస్‌ఓ సునీల్ రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్, ఆర్‌డీఓ నర్సింహారావు పాల్గొన్నారు.
2,41,137 మంది ఓటర్లు
ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డుస్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వివరించారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, ఆతర్వాత అక్కడే లెక్కింపు చేపడుతామని తెలిపారు. ఆయా పంచాయతీల్లో 2,41,137 మంది ఓటర్లకు గాను 1,16,384 మంది పురుషులు, 1,24,743 మంది మహిళలు, ఇతరులు 10 మంది ఉన్నారన్నారు. తొలి విడత ఎన్నికలకు 2,089 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తుండగా, 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఇతర ఉద్యోగులను నియమించామని తెలిపారు. అలాగే, ఏడు చొప్పున డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
చింతకాని/బోనకల్: మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనుండగా రిటర్నింగ్ అధికారులు, ఇతర ఉద్యోగులు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. చింతకాని, బోనకల్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలు, సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశాారు. సామగ్రి పంపిణీ, పోలింగ్, మాక్ పోలింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్‌కు ముందు రోజు ఎన్నికల సిబ్బంది కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని చెప్పారు. అనంతరం నాగులవంచలోని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని


