 
															నేడు ఖమ్మం మార్కెట్‌లో పంటల కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: వర్షాలు తగ్గిన నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పంటల కొనుగోళ్లు చేపడుతామని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మోంథా తుపాన్ కారణంగా మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. అయితే, గురువారం నుంచి తుపాను ప్రభావం లేకపోవడం, వర్షాలు తగ్గడంతో మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గుర్తించాలని సూచించారు.
1.50లక్షల పశువులకు గాలికుంటు టీకాలు
కామేపల్లి: పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా టీకాలు తప్పని సరిగా వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమణి సూచించారు. మండలంలోని మర్రిగూడెంలో గాలికుంటు టీకాల పంపిణీని గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 3.33 లక్షల పశువులకు గాను ఇప్పటివరకు 1.50 లక్షల పశువులకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. టీకా ఆవశ్యకతను గుర్తించి రైతులు పశు వైద్యాధికారులకు సహకరించాలని సూచించారు. ముచ్చర్ల పశువైద్యాధికారి గోపాల కృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘ఓపెన్’ ఫలితాలు విడుదల
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజ తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 279మంది హాజరుకాగా, 128మంది(45.88శాతం), ఇంట ర్ పరీక్షల్లో 248 మందికి 108మంది (43.55శాతం) ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఫలితాలను www.telangana openschool.org వెబ్‌సైట్‌లో చూసుకుని రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నవంబర్ 4 నుంచి 12వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో లేదా మీ సేవ సెంటర్లలో ఫీజు చెల్లించాలని సూచించారు. రీ కౌంటింగ్ కోసం ఇంటర్ అభ్యర్థులు పేపర్‌కు రూ.400, పదో తరగతి వారు రూ.350, రీ వెరిఫికేషన్, జవాబుపత్రం జిరాక్స్ కోసం సబ్జెక్టుకు రూ.1,200 చెల్లించాలని తెలిపారు.
ఆన్‌లైన్‌లో వివరాల నమోదు తప్పనిసరి
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న సేవలు, వినియోగించుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి అదేశించారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌పై గురువారం ఆమె తన కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న సేవలను పోర్టల్‌లో నమోదు చేస్తున్నా, ప్రైవేట్ ఆస్పత్రుల వివరాలు పూర్తిగా అందడం లేదని తెలిపారు. ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి డేటాను సేకరించాలని, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు. ప్రోగ్రామ్ అధికారులు చందూనాయక్, వెంకటరమణ, జిల్లా మాస్ మీడియా అధికారి వి.సుబ్రహ్మణ్యం, స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్‌కుమార్, డీఎస్‌ఓ వేణుమాధవ్ పాల్గొన్నారు.
అందుబాటులోకి
ధాన్యం ఆరబెట్టే యంత్రం
కల్లూరు: వరిలో తేమ తగ్గేలా ఆరబెట్టేందుకు ప్యాడీ డ్రయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు కల్లూరు వ్యవసాయ మార్కెట్‌కు కేటాయించిన యంత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే రైతులు నిర్దేశిత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని, లేకపోతే గింజ రంగు మారి నాణ్యత తగ్గుతుందని తెలిపారు. పచ్చి సరుకును తీసుకొచ్చి ఇబ్బంది పడకుండా డ్రయర్లు సమకూరుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కేంద్రాల్లో గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యం క్వింటాకు రూ.2389, సాధారణ రకానికి రూ.2,369 ధర లభిస్తుందని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, డీఎంఓ ఎండీ.అలీమ్, మార్కెట్ చైర్మన్ భాగం నీరజ, ఏఓ ఎం.రూప, మార్కెట్ సూపర్‌వైజర్ జగదీష్‌కుమార్, కార్యదర్శి జి.సత్యనారాయణ, నాయకులు పసుమర్తి చందర్‌రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు.
 
							నేడు ఖమ్మం మార్కెట్‌లో పంటల కొనుగోళ్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
