 
															‘సింగరేణి’లో కొత్త ఏరియా!
ఎట్టకేలకు సత్తుపల్లి కేంద్రంగా ఏర్పాటు
ఇన్నాళ్లు కొత్తగూడెం పరిధిలో నిర్వహణ
సత్తుపల్లి: ఎన్నో ఏళ్లుగా సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు, సంస్థ కార్మికులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఇన్నాళ్లు సత్తుపల్లిలోని గనులు కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉండగా.. ఇప్పుడు సత్తుపల్లి కేంద్రంగా కొత్త ఏరియా ఏర్పాటైంది. జీఎం సేఫ్టీ(కార్పొరేట్)గా విధులు నిర్వర్తిస్తున్న చింతల శ్రీనివాస్‌ను ఏరియా జీఎంగా నియమించడంతో ప్రతీ పనికి కొత్తగూడెం వెళ్లాల్సిన ఇక్కట్లు తీరనున్నాయి.
రోజుకు 40వేల టన్నుల ఉత్పత్తి
సత్తుపల్లి పరిధిలో జేవీఆర్ ఓసీ–2, కిష్టారం ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల నుంచి రోజుకు సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణిలో ఇప్పటివరకు ఉన్న 11 ఏరియాలకు తోడు 12వ ఏరియాగా సత్తుపల్లి ఆవిర్భవించింది. కాగా, సత్తుపల్లిలో ఏరియా జీఎం కార్యాలయానికి 2022 అక్టోబర్ 16 శంకుస్థాపన చేసినా పూర్తికాలేదు. దీంతో ప్రభావిత ప్రాంత ప్రజలు, కార్మికులు సమస్యలు చెప్పుకునేందుకు కొత్తగూడెం వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయమై ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లగా ఫలితం వచ్చింది. రూ.2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జీఎం కార్యాలయం పూర్తయ్యే వరకు సింగరేణి గెస్ట్‌హౌస్‌లో కార్యాలయం కొనసాగుతుంది. అలాగే, సేఫ్టీ, ఫైనాన్స్, పర్సనల్, సర్వే, ఎస్టేట్ విభాగాలు తప్ప మిగతావి సత్తుపల్లిలోనే అందుబాటులోకి వస్తాయి.
వైఎస్సార్ చేతుల మీదుగా..
సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్‌ను 2005 మార్చిలో నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉండగా జేవీఆర్ ఓసీ–2తో పాటు కిష్టారం ఓసీ ఏర్పాట య్యాయి. జేవీఆర్ ఓసీ–2 మరో 20 ఏళ్లు, కిష్టారం ఓసీ జీవితకాలం మరో నాలుగేళ్లు ఉంది. అంతేకాక బ్లాక్–3 ఓసీకి టెండర్లు దక్కించుకున్న కంపెనీ పనులు చేపట్టాల్సి ఉంది. సింగరేణిలోనే సత్తుపల్లి ఏరియా పెద్దది కాగా, జేవీఆర్ ఓసీలో 1,300 మంది, కిష్టారం ఓసీలో 150 మంది పర్మినెంట్ కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌లో 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
