 
															అందరినీ ఆదుకుంటాం...
● పంట నష్టంపై అంచనాల సేకరణ ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంఅర్బన్: తుపాన్ కారణంగా ఇళ్లు, పశువులు, పంటలతో పాటు ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం కాల్వొడ్డు, తదితర ప్రాంతాల్లో మున్నేటి ముంపు బాధితులను గురువారం పరామర్శించిన ఆయన నయాబజార్ కళాశాల పునరావాస శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యంత్రాంగం అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. మున్నేటి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే ముంపు బాధ తప్పుతుందని ఇందుకోసం ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ పి.నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఉద్యానవన అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు
ఖమ్మం సహకారనగర్: తుపాన్ నేపథ్యాన యంత్రాంగమంతా ప్రభావిత ప్రాంతాల్లో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పంటల నష్టం అంచనాల రూపకల్పన, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు, తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మున్నేటి వరద కారణంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఇతర చర్యలను వివరించారు. సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కీలకంగా ‘ఆపదమిత్ర’లు
ఖమ్మం సహకారనగర్: తుపాన్ సహాయక చర్యల్లో ఆపద మిత్రలు కీలకపాత్ర పోషించారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలో 300 మంది యువతకు శిక్షణ ఇవ్వగా, ప్రజలను అప్రమత్తం చేయడమే కాక సామగ్రి తరలింపులో సహకరించారని చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంమయూరిసెంటర్: మున్నేటికి వరద దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కాల్వొడ్డు వద్ద ప్రవాహాన్ని మేయర్ పునకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించాక ఆయన మాట్లాడారు. ఆతర్వాత నయాబజార్ స్కూల్, నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
