చేయి దాటిన పంటలు | - | Sakshi
Sakshi News home page

చేయి దాటిన పంటలు

Oct 31 2025 7:49 AM | Updated on Oct 31 2025 7:49 AM

చేయి దాటిన పంటలు

చేయి దాటిన పంటలు

● అంతటా నేలపాలైన వరి, పత్తి చేన్లు ● 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంట నష్టం

ప్రధానంగా

వరి, పత్తిపై ప్రభావం

తుపాన్‌తో ధ్వంసం
● అంతటా నేలపాలైన వరి, పత్తి చేన్లు ● 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంట నష్టం

ఖమ్మంవ్యవసాయం: మోంథా తుపాను అన్నదాత శ్రమను ఛిద్రం చేసింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులతో చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసమయ్యాయి. రెండు రోజుల పాటు విరుచుకుపడిన తుపాను తాకిడికి జిల్లాలో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమిక అంచనా వేశాయి. ఈ మేరకు జిల్లాలో 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. వరి, పత్తి, పప్పుధాన్యాలతో పాటు ఉద్యాన పంటలైన మిర్చి, కూరగాయల పంటలకు నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సమగ్ర సర్వే అనంతరం నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది.

అత్యధికం వరే...

జిల్లావ్యాప్తంగా 24,321 మంది రైతులకు చెందిన 36,893 ఎకరాల్లో వరికి నష్టం వాట్లిందని ప్రాథమికంగా గుర్తించారు. అలాగే, 16,544మంది రైతులకు చెందిన 22,574 ఎకరాల్లో పత్తి, 2,234 మంది రైతులకు సంబంధించి 2,923 ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. ఇక ఐదుగురు రైతులకు చెందిన 10 ఎకరాల్లో పప్పు ధాన్యాల పంటలకు నష్టం వాటిల్లిందని నివేదికలో పొందుపరిచారు. కాగా, సత్తుపల్లి వ్యవసాయ డివిజన్‌లో అత్యధికంగా 41 గ్రామాలకు చెందిన 7,008మంది రైతులు 13,055 ఎకరాల్లో వరి పంట నష్టపోయారు. కూసుమంచి డివిజన్‌లో 9,018 మంది రైతులు 11,058 ఎకరాల్లో, వైరా డివిజన్‌లో 5,064 మంది రైతులు 8,092 ఎకరాల్లో, మధిర డివిజన్‌లో 2,903 మంది రైతులు 4,173 ఎకరాల్లో, ఖమ్మం డివిజన్‌లో 328 మంది రైతులకు చెందిన 515 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇక పత్తి వైరా డివిజన్‌లో 7,942 మంది రైతులకు చెందిన 11,334 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మధిర డివిజన్‌లో 3,620 మంది రైతులకు 5,167 ఎకరాల్లో, కూసుమంచి డివిజన్‌లో 3,427 మంది రైతులకు చెందిన 4,088 ఎకరాల్లో, సత్తుపల్లి డివిజన్‌లో 1,555 మంది రైతులకు చెందిన 1,985 ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. మిర్చి, కూరగాయల పంటలు కూసుమంచి డివిజన్‌లో 1,769 మంది రైతులకు చెందిన 2,096 ఎకరాల్లో, మధిర డివిజన్‌లో 271 మంది రైతులకు 532 ఎకరాల్లో, సత్తుపల్లి డివిజన్‌లో 84 మంది రైతులకు 110 ఎకరాల్లో, వైరా డివిజన్‌లో 63 మంది రైతులకు చెందిన 110 ఎకరాల్లో, ఖమ్మం డివిజన్‌లో 47 మంది రైతులకు చెందిన 75 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పప్పుధాన్యం పంటలు ఎర్రుపాలెం మండలంలో ఐదుగురు రైతులకు చెందిన 10 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

జిల్లాలో వరి 2.98 లక్షల ఎకరాల్లో, పత్తి 2.51 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. పత్తి చేతికందుతున్న తరుణంలో తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎకరాకు 4 – 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాదని భావిస్తుండగా, తుపానుతో ఆ కాస్త ఆశలు కూడా కోల్పోయారు. అలాగే, కోత దశలో ఉన్న వరి నేలవాలగా, కంకి నీటిలో నాని దెబ్బతింటోంది. ఇది యంత్రాలతో కోయడం కూడా సాధ్యం కాదని, కూలీలతో కోయిస్తే అదనపు భారం పడుతుందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement