జాబ్‌మేళాకు సర్వం సిద్ధం
సింగరేణి – టాస్క్ ఆధ్వర్యాన
80కిపైగా కంపెనీలు,
సత్తుపల్లి: సింగరేణి సంస్థ – టాస్క్ సంయుక్త ఆధ్వర్యాన సత్తుపల్లిలో ఆదివారం మెగా జాబ్‌మేళా జరగనుంది. ఇందులో 80కి కంపెనీలు పాల్గొననుండగా, కనీసం 3వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. సుమారు 10వేల మంది నిరుద్యోగ యువత హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. ఏడో తరగతి మొదలు నుంచి పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు పాల్గొనవచ్చని సూచించగా, సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం షాలేం రాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు ఆధ్వర్యాన జాబ్‌మేళా జరిగే రాణి సెలబ్రేషన్ ప్రాంగణంలో శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
విస్తృత ప్రచారం
సత్తుపల్లిలో జరిగే జాబ్‌మేళాను ఎక్కువ మంది నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యాన విస్తృత ప్రచారం చేశారు. అధికారులు, పార్టీ నేతలతో కలిసి గ్రామాలు, వార్డుల వారీగా పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేయించారు. అంతేకాక విద్యాసంస్థల నుంచి పూర్వ విద్యార్థులకు ఫోన్ చేయించడంతో పాటు మెసేజ్‌లు పంపించారు. కాగా, జాబ్‌మేళాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే నిరుద్యోగులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాక ప్రైవేట్ పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల సౌజన్యంతో వాహనాలు సైతం సమకూరుస్తున్నారు. ఒకేసారి పెద్దసంఖ్యలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా రెండు పెద్ద హాళ్లు సిద్ధం చేశారు.
‘టాస్క్’ ఆధ్వర్యాన శిక్షణ
సింగరేణి, టాస్క్ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగుల్లో సందేహాలు తొలగించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాల్డెజ్(టాస్క్) ప్రాజెక్టు మేనేజర్ బాలు ప్రవరాఖ్య అవగాహన కల్పిస్తున్నారు. మూడు రోజులుగా రోజుకు ఐదు బ్యాచ్‌ల చొప్పున యువతలో కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించడం, డ్రస్‌కోడ్, ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాక రెజ్యూమ్ తయారీపై శిక్షణ ఇచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొంటారని చెబుతున్నారు.
నేడు సత్తుపల్లిలో..
3వేల మందికి ఉద్యోగాలు
జాబ్‌మేళాకు సర్వం సిద్ధం


