
డబ్బు తక్కువ ఇచ్చారని హిజ్రాల దూషణ
నేలకొండపల్లి: అడిగినంత డబ్బు ఇవ్వండి.. లేకపోతే మా శాపానికి బతుకులు ఆగమవుతాయంటూ కొందరు హిజ్రాలు బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నేలకొండపల్లిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పలువురు వ్రతం చేసుకుంటుండగా ఇద్దరు హిజ్రాలు చేరుకున్నారు. ఇందులో ఒకరు ఇంటింటికీ వెళ్లి అడిగినంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని బెదిరించారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొందరు డబ్బులు ఇవ్వగా మరికొందరు తక్కువ ఇవ్వబోగా శాపనార్ధాలు పెట్టారు. నేలకొండపల్లి, బైరవునిపల్లి,ఆరెగూడెం, సింగారెడ్డిపాలెం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా విసిగిపోయిన స్థానికులు ఆగ్రహంతో దాడికి యత్నించగా హిజ్రాలు ఇద్దరు వాహనంపై పారిపోయారు. కాగా, టెంట్ కనిపిస్తే చాలు శుభ, అశుభ కార్యమేదైనా డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న హిజ్రాల తీరుపై పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
కత్తి దాడిలో
ఒకరికి తీవ్ర గాయాలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి సాయిగణేష్‌నగర్‌కు చెందిన గుడిపెల్లి సుదర్శన్‌పై అదే కాలనీకి చెందిన మెడికంటి రాజవర్ధన్‌రెడ్డి కత్తితో దాడి చేయగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... సుదర్శన్ గురువారం రాత్రి స్థానిక సూపర్ మార్కెట్‌కు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తిని రాజవర్ధన్‌రెడ్డి కొడుతుండడంతో అడ్డుకోబోయాడు. దీంతో సుదర్శన్‌పై రాజవర్ధన్‌రెడ్డి కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై క్షతగాత్రుని భార్య ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు. కాగా, సుదర్శన్‌ను మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ టి.దయాకర్‌రెడ్డి పరామర్శించారు.
చోరీ కేసుల్లో
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఖమ్మంరూరల్: పలు చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాలు... ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన మోతె శ్రీను, పవార్ తరుణ్ కలిసి తిరుమలాయపాలెం మండలంలో పలు చోరీలకు పాల్ప డ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన ఉప్పలమ్మ ఇంట్లో చోరీ చేయగా, గొల్లగూడెం గోదాం వద్ద ఒక జంట ద్విచక్రవాహనంపై ఆరెంపులకు వస్తుండగా వారి నుంచి తులం బంగారు గొలుసు లాక్కున్నారు. అలాగే, జూన్ 27న తిరుమలాయపాలెంలో పొలానికి వెళ్తున్న వ్యక్తి నుంచి ఉన్న రెండు తులాల బంగారు లాకెట్ అర తులం బంగారు ఉంగరం, సెల్‌ఫోన్, ఇదే నెల 13న పిండిప్రోలులో మహిళ నుంచి తులం బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. అంతేకాక కూసుమంచి మండలం లింగారాంతండా వద్ద మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో పారిపోయారు. ఈమేరకు నిందితులను గుర్రాలపాడు వద్ద శుక్రవారం అరెస్ట్ చేసి ఆభరణాలు, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ముష్క రాజు, ఎస్‌ఐ విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.